పురుడు పోశారు.. పునర్జన్మనిచ్చారు 

8 Jan, 2024 05:05 IST|Sakshi

కొండపైన నివాసముంటున్న గర్భిణికి పురిటి నొప్పులు 

150 మెట్లు ఎక్కి సుఖప్రసవం చేసిన 108 అంబులెన్స్‌ ఈఎంటీ, పైలెట్‌ 

తల్లీబిడ్డ క్షేమం.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): కొండపైకి 150 మెట్లెక్కి వెళ్లి మరీ ఓ గర్భిణికి పురుడు పోసి పునర్జన్మనిచ్చి స్థానికుల ప్రశంసలు 108 సిబ్బంది అందుకున్న ఘటన విజయవాడలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... బతుకుతెరువు కోసం కాశీ నుంచి నగరానికి వచ్చి న రోహిత్, హారతి కుటుంబం విజయవాడ భవానీపురం పరిధిలోని కుమ్మరిపాలెం కొండ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది.

నెలలు నిండిన హారతికి నొప్పులు రావడంతో దిక్కుతోచని స్థితిలో రోహిత్‌ 108 అంబులెన్స్‌కు కాల్‌ చేశాడు. కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో ఉన్న 108 సిబ్బంది ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. కొండపైన 150 మెట్లు ఎక్కి ఆమె వద్దకు చేరుకున్నారు. నొప్పులు తీవ్రం కావడంతో అల్లాడుతున్న భార్యను చూసి భర్త కన్నీరుమున్నీరుగా విలపించసాగాడు.

అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయిన 108 అంబులెన్స్‌ ఈఎంటీ విజయ్, పైలెట్‌ సందీప్‌కుమార్‌ తీవ్రంగా శ్రమించి ఆమెకు కాన్పు చేశారు. మగ బిడ్డ జన్మించాడు. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదంతా గమనించిన స్థానికులు శెభాష్‌ అంటూ 108 సిబ్బందిని అభినందించారు.

>
మరిన్ని వార్తలు