ఎన్‌డీబీ రీ టెండర్లలో 12 బిడ్లు  | Sakshi
Sakshi News home page

ఎన్‌డీబీ రీ టెండర్లలో 12 బిడ్లు 

Published Tue, Nov 17 2020 5:00 AM

12 Bids In NDB Re-Tenders - Sakshi

సాక్షి, అమరావతి: న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదార్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి గత నెలలో పిలిచిన రీ టెండర్లలో 10 కాంట్రాక్టు సంస్థలు 12 బిడ్లు దాఖలు చేశాయి. తొలిదశలో నాలుగు జిల్లాల్లో పిలిచిన రీ టెండర్ల టెక్నికల్‌ బిడ్లను ఆర్‌అండ్‌బీ అధికారులు సోమవారం తెరిచారు. ఒక్కో జిల్లాలో మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గతంలో మాదిరిగా 13 జిల్లాలకు ఒకేసారి టెండర్లు పిలవకుండా నాలుగు జిల్లాలకు మాత్రమే రీ టెండర్లు పిలిచారు.

మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టే రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు మొదట ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. దీనిపై ఆర్‌అండ్‌బీ ముఖ్య అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పోటీతత్వం పెంచేందుకు ఆ టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో అవి రద్దయిన సంగతి తెలిసిందే. రీ టెండర్లకు తొలివిడతగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాలను ఎంపికచేసిన అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ జారీచేశారు. రెండు నిబంధనల్ని సవరించి, నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి ఈ టెండర్లను పిలిచారు. సోమవారం ఈ టెక్నికల్‌ బిడ్లు తెరిచిన అధికారులు వాటిని పరిశీలించి అర్హత సాధించిన సంస్థల వివరాలు ప్రకటిస్తారు. అనంతరం రివర్స్‌ టెండర్లు నిర్వహించనున్నారు.   

Advertisement
Advertisement