మహిళామణులకు పట్టాభిషేకం | Sakshi
Sakshi News home page

మహిళామణులకు పట్టాభిషేకం

Published Mon, May 30 2022 5:34 AM

3 Years Of YS Jagan Government Support To Womens - Sakshi

సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ జకియా ఖానంను పెద్దల సభగా పేరొందిన శాసనమండలి వైస్‌ చైర్మన్‌ కుర్చీలో కూర్చోబెట్టడం ద్వారా మహిళా మణులకు అత్యున్నత గౌరవం కల్పించారు. రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా ఒక ముస్లిం మహిళకు పెద్ద బాధ్యతలు అప్పగించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారు. బీసీ మహిళ అయిన ఉప్పాల హారికకు కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతలు అప్పగించి తన ఆదర్శాన్ని చాటారు. జనరల్‌ మహిళకు కేటాయించిన కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళకు కట్టబెట్టిన సీఎం జగన్‌ రాజకీయ రంగంలో మహిళా లోకానికి కొత్త దారులు వేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో మహిళామణులకు పదవుల పట్టాభిషేకం చేయడంలో సీఎం వైఎస్‌ జగన్‌ మూడేళ్లలో రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా రాజకీయంగా, ఆర్థికంగా మహిళల సాధికారత, స్వావలంబనకు విప్లవాత్మక చర్యలు చేపట్టిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ తలెత్తుకుని దేశం ముందు సగర్వంగా నిలబడేలా చేశారు. 

మంత్రి వర్గంలోనూ పెద్దపీట
మంత్రివర్గంలో మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. 2019 మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించగా.. 2022 మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. రెండు పర్యాయాలు కూడా కీలకమైన హోంశాఖను దళిత మహిళలకే అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖను తానేటి వనిత, ఆరోగ్య శాఖను విడదల రజని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఉషశ్రీ చరణ్, పర్యాటక, యువజన సర్వీసుల శాఖను ఆర్కే రోజాకు అప్పగించడం విశేషం.

పదవులు.. పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌
చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంట్‌లో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ.. ఇప్పటివరకు కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏ డిమాండ్లు, ఏ ఉద్యమాలు లేకుండానే.. ఎవరు అడగకపోయినా సీఎం వైఎస్‌ జగన్‌ చొరవ తీసుకుని రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం, నామినేషన్‌ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది.

గడచిన మూడేళ్లలో మహిళలకు 50 శాతానికి మించి పదవులు కట్టబెట్టడం గమనార్హం. నామినేటెడ్, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీలో మహిళలకు 51 శాతం వాటా దక్కింది. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌ పదవులు 202 ఉంటే.. వాటిలో 102 చైర్‌పర్సన్‌ పదవులను మహిళలకే ఇచ్చారు. 1,154 డైరెక్టర్‌ పదవుల్లో 586 పదవులు కూడా మహిళలకే కట్టబెట్టారు. 202 మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో 102 మహిళలకే కేటాయించారు. 1,356 రాజకీయ పదవుల నియామకాల్లో 688 పదవులు అంటే 51 శాతం అక్కచెల్లెమ్మలకే ఇచ్చారు.

వార్డు పదవి నుంచి జెడ్పీ చైర్మన్‌ వరకు..
రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరగ్గా.. వాటిలో 7 జిల్లాల జెడ్పీ పీఠాలను మహిళలకు కేటాయించడం ద్వారా 54 శాతం అవకాశం కల్పించారు. 26 జెడ్పీ వైస్‌ చైర్మన్లలో 15 మంది మహిళలే. మొత్తంగా 12 మేయర్, 24 డిప్యూటీ మేయర్‌ కలిపి 36 పదవులు ఉంటే.. వాటిలో 18 పదవులు మహిళలవే. వార్డు మెంబర్లు 671 మందిలో 361 మంది మహిళలే ఉన్నారు. 75 మునిసిపాలిటీల్లో 45 మంది మహిళా చైర్‌పర్సన్‌లే.

మునిసిపాలిటీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 పదవులు మహిళలకే దక్కాయి. గ్రామ సర్పంచ్‌ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీ పదవుల్లో 54 శాతం, మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం మహిళలకే పట్టాభిషేకం చేయడం విశేషం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అమలులోకి తెచ్చిన వలంటీర్‌ ఉద్యోగాలు 2.60 లక్షల మందిలో 53 శాతం యువతులే సేవలు అందిస్తుండటం గమనార్హం. ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలోనూ మహిళా పోలీస్‌లను నియమించారు. 

మహిళా సంక్షేమంలోను  ముందడుగు
మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంక్‌ అకౌంట్లకు జమ చేస్తోంది ప్రభుత్వం. మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ పెట్టి వారి పురోగతికి ఊతమిస్తోంది. ఈ మూడేళ్లలో (ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు) రూ.1,22,472.23 కోట్ల లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం మహిళా సంక్షేమంలో ముందడుగు వేసింది. వాటిలో మచ్చుకు కొన్ని వివరాలు ఇవి..

► రాష్ట్రంలో పేదింటి అక్కచెల్లెమ్మలకు సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం పారదర్శకంగా 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది. వారికి శాశ్వత గృహ వసతితోపాటు మౌలిక సదుపాయాలను సమకూర్చే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఇందుకుగాను 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్‌ మెరిట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అవార్డు కూడా లభించింది. 
► 2019 ఎన్నికల రోజు వరకు మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలను మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో వారి చేతికే అందించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.25,517 కోట్లను నాలుగు విడతలుగా నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించి ఇప్పటి వరకు (ఈ ఏడాది ఏప్రిల్‌) రూ.12,758 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
► వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకంలో పొదుపు సంఘాల ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ మొత్తాన్ని ఆయా సంఘాల రుణ ఖాతాల్లోనే జమ చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ తోడ్పాటుతో 99.27 శాతం సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మలు సకాలంలో రుణాల కిస్తీలను చెల్లిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. డ్వాక్రా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీ శాతం 13.5 నుంచి 9.5 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు 1.02 కోట్ల మందికి రూ.3,615 కోట్లు వడ్డీ సాయం అందించింది. 

► వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం కింద రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు పోషకాహారాన్ని అందించేందుకు ఇప్పటివరకు 34.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,895.45 కోట్లు ఖర్చు చేసింది.
► వైఎస్సార్‌ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ డబ్బులు వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు 24.96 లక్షల మందికి రూ.9,180 కోట్లను ప్రభుత్వం అందజేసింది.
► స్వేచ్ఛ పథకం కింద రుతుక్రమ సమయంలో స్కూళ్లకు వెళ్లలేక బాలికలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7వ తరగతి నుంచి 12వ వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్‌కిన్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి రూ.32 కోట్లతో నాప్‌కిన్లు అందించారు.
► మహిళల సత్వర రక్షణే ధ్యేయంగా, దోషులకు సత్వర శిక్షే లక్ష్యంగా.. మహిళల సమస్యలకు నూరు శాతం పరిష్కారం చూపేలా దిశ బిల్లు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 
► పూర్తిస్థాయిలో మహిళా కమిషన్‌ ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు వారికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  

Advertisement
Advertisement