విశాఖలో బీఎస్‌–6 ఇంధన ఉత్పత్తి | Sakshi
Sakshi News home page

విశాఖలో బీఎస్‌–6 ఇంధన ఉత్పత్తి

Published Mon, Mar 22 2021 4:17 AM

BS‌6 fuel production in Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కాలుష్య నియంత్రణకు సంబంధించి విశాఖపట్నం ప్రముఖ పాత్ర పోషించనుంది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు అవసరమైన భారత్‌ స్టేజ్‌–6 (బీఎస్‌–6) ఇంధనం ఉత్పత్తి చేసేందుకు విశాఖ కేంద్రంగా హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. బీఎస్‌–6 వాహనాలు వినియోగించాలని ఏడాది కిందటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీఎస్‌–4 వాహనాలతో పోలిస్తే.. బీఎస్‌–6 వాహనాల నుంచి వచ్చే కాలుష్యం చాలా తక్కువ. బీఎస్‌–6 పెట్రోల్‌ వాహనం నుంచి నైట్రోజన్‌ ఆక్సైడ్‌ 25 శాతం వరకు తక్కువ వెలువడుతుంది. దీనికి కారణం.. ఆయా వాహనాలకు అనువైన పెట్రోల్‌ తయారు చేయడమే. బీఎస్‌–6కి అవసరమైన ఇంధన వనరుల ఉత్పత్తికి విశాఖ కేంద్రం కానుంది. కాలుష్య ఉద్గారాల్ని తగ్గించేలా బీఎస్‌–6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాలు ఉత్పత్తి చేసే వ్యవస్థకు హెచ్‌పీసీఎల్‌ కొద్ది రోజుల్లో శ్రీకారం చుట్టనుంది.

విశాఖలో హెచ్‌పీసీఎల్‌ విస్తరణలో ఆధునిక ప్రాజెక్టులో భాగంగా.. బీఎస్‌–6 పెట్రోల్, డీజిల్‌ ఉత్పత్తి చేపట్టనుంది. ఇందుకుగాను రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణలో అత్యంత కీలకమైన భారీ రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. అత్యంత కీలకమైన మూడు ఎల్‌సీ మ్యాక్స్‌ (లుమ్మస్‌ సిటీస్‌ మ్యాక్స్‌) రియాక్టర్లను విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేస్తారు. ఎల్‌ అండ్‌ టీ సంస్థ వీటిని తయారుచేసి గుజరాత్‌లో హెచ్‌పీసీఎల్‌ ప్రధాన కార్యాలయానికి అప్పగించింది. ఇప్పటికే రెండు రియాక్టర్లను సముద్రమార్గం ద్వారా విశాఖ తీసుకొచ్చారు. త్వరలో మూడో రియాక్టర్‌ వచ్చిన తరువాత వీటిని అమరుస్తారు. 67.817 మీటర్ల పొడవు, 12.2 మీటర్ల వెడల్పుతో ఉన్న ఒక్కో రియాక్టర్‌ బరువు 2,105 టన్నులు. ప్రపంచంలోనే అతిపెద్దవైన ఈ మూడు రియాక్టర్లు దేశంలో తొలిసారి ఆర్‌.యు.ఎఫ్‌. (రిసిడ్యూ అప్‌గ్రేడేషన్‌ ఫెసిలిటీ) క్రూడ్‌ ఆయిల్‌ నుంచి బీఎస్‌–6 డీజిల్‌ను తీసేందుకు ఉపయోగపడనున్నాయి. సల్ఫర్‌ అత్యధికంగా ఉండే ముడి చమురును కూడా.. బీఎస్‌–6 ప్రమాణాలకు అనువైన అధిక నాణ్యత కలిగిన పెట్రోల్, డీజిల్‌గా మార్చే ప్రక్రియను ఇక్కడ చేపడతారు.

త్వరలోనే పనులు ప్రారంభం
విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్నాయి. త్వరలో మూడో రియాక్టర్‌ కూడా రానుంది. వీటి ద్వారా బీఎస్‌–6 వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసి.. హెచ్‌పీసీఎల్‌ మరో ముందడుగు వేయనుంది. చమురు ఉత్పత్తుల్ని మెరుగుపరచడమే కాకుండా ఫీడ్‌ స్టాక్‌ పెంచేందుకు కూడా ఈ రియాక్టర్లు ఉపయోగపడతాయి.
– రతన్‌రాజ్, హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 

Advertisement
Advertisement