ఆర్సీహెచ్‌తో గర్భిణుల అభా ఐడీ మ్యాపింగ్‌ | Sakshi
Sakshi News home page

ఆర్సీహెచ్‌తో గర్భిణుల అభా ఐడీ మ్యాపింగ్‌

Published Sun, Jul 16 2023 4:26 AM

Abha ID mapping of pregnant women with RCH - Sakshi

గర్భిణులు, బాలింతలు, పుట్టిన బిడ్డలకు అందించేవైద్య సేవలన్నింటినీ డిజిటలైజేషన్‌ చేయడానికి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గర్భిణుల ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్‌ (అభా)ను రీప్రొడక్టివ్, చైల్డ్‌ హెల్త్‌ (ఆర్సీహెచ్‌) పోర్టల్‌తో మ్యాపింగ్‌ చేస్తోంది.    

రాష్ట్రంలో 2022–23లో 8.71 లక్షలు, 2023–24లో ఇప్పటి వరకు 2.34 లక్షల మంది గర్భిణులు ఆర్సీహెచ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయ్యారు. ప్రతి గర్భిణికి ప్రత్యేక రిజి్రస్టేషన్‌ ఐడీ ఉంటుంది. అభా నంబర్‌ను ఈ ఐడీతో అనుసంధానిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 5.09 లక్షల మంది గర్భిణుల అభా ఐడీలను ఆర్సీహెచ్‌తో అనుసంధానించారు. మరో 5.95 లక్షల మంది ఐడీల అనుసంధానం కొనసాగుతోంది.

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 శాతం గర్భిణుల మ్యాపింగ్‌ పూర్తయింది. తూర్పు గోదావరిలో 68.71 శాతం, అనకాపల్లిలో 59.25 శాతం మ్యాపింగ్‌ చేశారు. ఆర్సీహెచ్‌ పోర్టల్‌తో అభాను మ్యాపింగ్‌ చేస్తే గర్భం దాల్చిన నాటి నుంచి ఆ మహిళకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, టీకాల వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆర్సీహెచ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అవన్నీ అభాలో నిక్షిప్తం అవుతాయి. ప్రసవానంతరం బాలింత వైద్య పరీక్షల వివరాలు కూడా ఇందులో నమోదవుతాయి. 

మరోవైపు చిన్నపిల్లలకు సార్వత్రిక టీకాల నమోదు కోసం కోవిన్‌ తరహాలో యూవిన్‌ పోర్టల్‌ను కేంద్ర వైద్య శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రకాశం, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా నడుస్తోంది. ఈ యూవిన్‌ పోర్టల్‌కు తల్లి అభా ఐడీని మ్యాప్‌ చేయడం ద్వారా చిన్నారుల టీకా వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పుడైనా సార్వత్రిక వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. 

79.95 శాతం మందికి అభా ఐడీ 
ప్రజలకు డిజిటల్‌ వైద్య సేవలపై వైద్య శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎం) అమలులో తొలి నుంచి రాష్ట్ర వైద్య శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి అభా ఐడీ సృష్టించాల్సి ఉంది. ఇప్పటివరకు 3.84 కోట్ల మందికి అంటే.. 79.95 శాతం మందికి వైద్య శాఖ ఐడీలు సృష్టించింది.

ఎన్‌సీడీ–సీడీ నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరికీ అభా ఐడీ సృష్టిస్తున్నారు. దీంతో పాటు బీపీ, సుగర్, ఇతర వ్యాధులపై స్క్రీనింగ్‌ నిర్వహిస్తూ ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. టీబీ, డయాలసిస్, సికిల్‌ సెల్‌ అనీమియా రోగులకు కేటాయించిన ప్రత్యేక ఐడీలను అభాతో అనుసంధానిస్తున్నారు.  

– సాక్షి, అమరావతి 

Advertisement
Advertisement