Active Relief Measures in Godavari Flood Areas - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: వరద ప్రాంతాల్లో వేగంగా సాయం

Published Sun, Jul 30 2023 4:24 AM

Active relief measures in Godavari flood areas - Sakshi

సాక్షి, అమరావతి / సాక్షి నెట్‌వర్క్‌: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మ­రంగా కొనసాగుతున్నాయి. ముంపు బారిన పడిన జిల్లాల్లోని 211 గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 46,170 మంది బాధితులను అక్కడికి యుద్ధ ప్రాతిపదికన తరలించింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి 43,587 మందికి తాత్కాలికంగా పునరావాసం కల్పించారు. ఏలూరు జిల్లాలో 4 కేంద్రాల్లోకి 1,528 మందిని, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 18 కేంద్రాలకు 758, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి 306 మందిని తరలించారు.

ఆయా ప్రాంతాల్లో తక్షణ వైద్య సౌకర్యం కల్పించేందుకు 68 వైద్య శిబిరాలు నెలకొల్పారు. మొత్తం 178 బోట్లు, 10 లాంచీలను సహాయక చర్యల కోసం ఏర్పాటు చేశారు. ఐదు జిల్లాలకు ప్రభుత్వం తక్షణ అవ­సరాల కోసం రూ.12 కోట్లు విడుదల చేయడంతో పునరా­వాసకేంద్రాల ఏర్పాటు, బాధితుల తరలింపు, వా­రికి అవసరమైన ఆహారం, తాగు నీరు ఇతర సౌ­కర్యాల కల్పన వేగంగా జరిగింది. ఐదు జిల్లాల్లో మొత్తం 26 మండలాల్లోని 211 గ్రామాలపై గోదావరి వరద ముంపు ప్రభావం పడినట్లు నిర్ధారించి, ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 96 గ్రామాలు ప్రభావితమయ్యాయి.

ఈ నేపథ్యంలో 10 ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరులో రెండు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ పోలవరంలో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం, చింతూరు, పి గన్నవరం, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో ఒక్కొక్కటి చొప్పున ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు.

ఇప్పటికే ఆ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌ నుంచి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు.

 

ఎక్కడికక్కడ పర్యవేక్షణ
వరద తాకిడికి గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం ఎటపాక మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు సంబంధించి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీటితో పాటు వాడుక నీటి సౌకర్యం కల్పించారు. విద్యుత్‌ అందుబాటులో లేని ప్రాంతాల్లో జనరేటర్‌ సౌకర్యం కల్పించారు.

బాధితులకు నిత్యావసరాలతో పాటు కూరగాయలు, పాలు అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా కేంద్రాల పరిసరాల్లో బ్లీచింగ్, ఫాగింగ్‌ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లను అందుబాటులో వుంచారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

చింతూరు మండలంలో బాధితులకు కూరగాయలు, పాలతో పాటు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. కిరోసిన్‌ పంపిణీకి కలెక్టర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారికి 10 వేల టార్పాలిన్లను సిద్ధం చేస్తున్నారు. కూనవరం మండలంలో 12, వీఆర్‌పురం మండలంలో 10, చింతూరు మండలంలో 8 మర పడవలను సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 

 వరద ముంపు ప్రాంతాలకు లాంచీలు, పడవల ద్వారా కూరగాయలను పంపించారు. చింతూరు జీసీసీ గోడౌను నుంచి వీఆర్‌పురం, కూనవరం మండలాలకు మూడు టన్నుల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, రెండు టన్నుల చొప్పున వంకాయలు, దొండకాయలు పంపించారు. 


 
నడి గోదావరిలో ఆరుగురు గర్భిణుల తరలింపు 
నడి గోదావరిలో శనివారం రాత్రి 10.30 గంటలకు బోట్‌పై ఆరుగురు గర్భిణులను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రానికి తరలించాయి. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజీవ్‌ వేలేరుపాడు మండలంలో అత్యంత మారుమూల గ్రామాలైన టేకుపల్లి, టేకూరు గ్రామాల్లో ఆరుగురు గర్భిణులను గుర్తించారు. వీరిని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించేందుకు బోట్‌పై ప్రయత్నించగా, తిర్లాపురం గ్రామానికి వచ్చేసరికి చీకటి పడి అక్కడే బోట్‌ ఆగిపోయింది.

దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌యాదవ్, మిగిలిన బృంద సభ్యులు.. ఆరుగురు గర్భిణులను వేలేరుపాడుకు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వారిని తీసుకెళ్లారు. 

నిత్యావసర వస్తువుల పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో అయోధ్య లంక, మర్రిమూల, పెదమల్లం గ్రామాల్లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. యలమంచిలి మండలంలోని లంక గ్రామాలైన దొడ్డిపట్ల, కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, ఏనుగువాని లంక, బాడవ గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి లంక గ్రామాల్లో పర్యటించారు.  

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం రాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంలో ఐదు గ్రామాలు నీటమునిగాయి. పాత నార్లవరం, ఎడవల్లి, టేకూరు, రుద్రమకోట, వేలేరుపాడు సంతబజారుల్లో 30 ఇళ్ల వరకు నీటమునగడంతో జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వీరందరికీ భోజన వసతి కల్పించారు.

వేలేరుపాడులో పది దేశీయ బోట్‌లు, రెండు పెద్ద బోట్‌లు, మరో రెండు ఫైర్‌ బోట్‌లు వినియోగిస్తున్నారు. వరద బారిన పడిన కుటుంబాలన్నిటికీ ఆదివారం 3900 లీటర్ల వంట నూనె, 4 వేల కేజీల కందిపప్పు, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేయనున్నారు. నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్‌‡్ష రాజేంద్రన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీ దగ్గరుండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.   

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య వరద చేరింది. స్థానికులు పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.  వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు.

రాష్ట్ర రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్‌ అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో పునరావస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. వారి కోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణు గోపాలరావు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ శనివారం కూనవరం, వీఆర్‌పురం మండలంలో వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 30 పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.  

దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పెంపు
సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు గ్రామాలకు చెందిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సొమ్మును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఆర్ధికసాయంపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అదే విధంగా ఈ జిల్లాల్లో ముంపునకు గురైన కుటుంబాలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, కేజీ కందపప్పు, లీటర్‌ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ సరుకులను సమకూర్చాల్సిందిగా మార్కెటింగ్‌కు ఆదేశాలిచ్చారు. దెబ్బతిన్న, పాడైన ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేశారు. 

Advertisement
Advertisement