ఫజుల్లాబాద్‌కు విదేశీ పక్షులు.. ప్రాణంగా చూసుకుంటాం.. | Sakshi
Sakshi News home page

విదేశీ పక్షుల రాకతో ఫజుల్లాబాద్‌లో సందడి

Published Wed, Oct 26 2022 6:58 PM

Alluri Sitarama Raju District: Many Birds From Siberia Come to Devipatnam - Sakshi

రంపచోడవరం: విదేశీ పక్షుల రాకతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్‌ గ్రామం సందడిగా మారింది. సుమారు వెయ్యికి పైగా సైబీరియా పక్షులు గ్రామానికి తరలివచ్చాయి. గ్రామంలోని చెట్లను ఆవాసంగా మార్చుకున్నాయి. నైరుతి  రుతుపవనాలు ఆగమనంతో ఇవి ఏటా ఇక్కడికి చేరుకుంటాయి. మధ్య ఆసియాలోని సైబీరియా కన్నా ఈ ప్రాంతంలో వేడి వాతావరణం ఉండటం వీటి సంతానోత్పత్తికి అనుకూలం. అందువల్ల ఏటా జూలై, ఆగస్టులో వచ్చి కార్తీక మాసం చివరి వరకు ఇక్కడే ఉంటాయి. సంతానోత్పత్తి అనంతరం పిల్లలతో ఇక్కడి నుంచి వెళ్లిపోతాయని గ్రామస్తులు తెలిపారు. 


ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చే విదేశీ పక్షులు ఇక్కడ సుమారు ఐదు నెలలపాటు ఉంటాయి. వీటిని అతిథులు మాదిరిగా గ్రామస్తులు చూసుకుంటారు. తమ తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో గ్రామంలోని పక్షులకు ఎవరైనా హాని తలపెడితే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏటా గ్రామానికి వస్తుండటంతో వాటికి ఎటువంటి హాని జరగకుండా ప్రాణంగా చూసుకుంటున్నారు. ఐదు నెలలపాటు గ్రామంలో చింతచెట్లపైనే ఉంటున్నాయి. 


గతంలో ఏటా రెండు వేలకు పైగా పక్షులు వచ్చేవి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు వెయ్యికి తగ్గిపోయిందని గ్రామస్తులు తెలిపారు. జూలై నెలలో వచ్చి చెట్లపై గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలను చేసి నవంబరు నెలాఖరులోపు వెళ్లిపోతాయి. ఫజుల్లాబాద్‌ గ్రామానికి చుట్టుపక్కల పంటపొలాలు, చెరువులు ఉన్నందున ఆహారం లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కోతుల బెడద ఎక్కువైంది. పక్షలు గూళ్లను పాడు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.  


ప్రాణంగా చూసుకుంటున్నాం 

గ్రామంలో ఉండే కొంగలకు ఎవరు హాని తలపెట్టారు. మొదట్లో వాటిని పట్టుకునేందుకు వేటగాళ్లు ప్రయత్నించారు. గ్రామస్తులంతా అడ్డుకున్నారు. అప్పటినుంచి ఎవరూ హాని తలపెట్టరు. వాటిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాం. ఈ పక్షులను తిలకించేందుకు పర్యాటకులు వస్తుంటారు. 
– ధర్మరాజు, ఫజుల్లాబాద్, దేవీపట్నం మండలం

Advertisement
Advertisement