ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులు

Published Thu, Mar 21 2024 5:20 AM

Ample medicines in government hospitals - Sakshi

సీఎం జగన్‌ పాలనలో ఆస్పత్రుల్లో మందుల కొరత రాకుండా చర్యలు 

డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలతో నాణ్యమైన మందులు సరఫరా 

టీడీపీ ప్రభుత్వంలో మందుల సరఫరాకు 2015–19 మధ్య రూ. 868 కోట్లు ఖర్చు 

ప్రస్తుత ప్రభుత్వంలో 2019 నుంచి రూ. 2,090 కోట్లు వ్యయం 

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. చంద్రబాబు పాలనలో ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉండేది. దీంతో అప్పట్లో ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఈ పరిస్థితులను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల పాలనలో పూర్తిగా చక్కబెట్టింది. ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులను ఉంచేలా చర్యలు తీసుకుంది. 2019 ముందు ఏటా చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు చేసి మందుల సరఫరా చేపట్టింది.   

కొరతకు తావివ్వకుండా   
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వో, గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాక్టీస్‌ (జీఎంపీ) ప్రమాణాలు కలిగిన నాణ్యమైన మందులను ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల సరఫరాకు సంబంధించి 2018–19 సమయంలో రేట్‌ కాంట్రాక్ట్‌లో 608 గాను 229 మందులే ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వంలో 608 మందులకు గాను 566 మందులు రేట్‌ కాంట్రాక్ట్‌లో ఉంటున్నాయి. రేట్‌ కాంట్రాక్ట్‌లో ఉన్న మందులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ ద్వారా ఏపీఎంఎస్‌ఐడీసీ సరఫరా చేస్తోంది.

తక్కువ వినియోగం ఉన్న మందులను డి–సెంట్రలైజ్డ్‌ బడ్జెట్‌ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఇలా విలేజ్‌ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  200లకు పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. పీహెచ్‌సీలు, విలేజ్‌క్లినిక్స్‌కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే అందుబాటులో ఉంచుతున్నారు.
  
మందుల బడ్జెట్‌లో గణనీయమైన పెరుగుదల 
టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో మందుల కోసం బడ్జెట్‌ గణనీయంగా పెరిగింది. పెరిగిన బడ్జెట్‌ ప్రభుత్వాస్పత్రుల్లో పుష్కలంగా మందులు ఉంటున్నాయనడానికి నిదర్శనంగా నిలిచింది. టీడీపీ ప్రభుత్వంలో 2015–19 మధ్య మందుల కోసం సుమారు రూ. 868 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ. 216 కోట్లు మాత్రమే మందులకు వెచ్చించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 నుంచి మందుల కోసం రూ. 2,090.39 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ. 418.07 కోట్లు వ్యయం చేశారు. దీన్ని బట్టి టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఏటా రూ. 200 కోట్లకు పైగా అదనంగా మందుల కోసమే ఖర్చు పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగి వైద్య సేవల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.700 కోట్ల మేర మందుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. 

Advertisement
Advertisement