Sakshi News home page

‘థ్యాంక్యూ సీఎం సార్‌’.. సీపీఎస్‌కు బదులు మెరుగైన జీపీఎస్‌

Published Sat, Jun 10 2023 8:27 AM

Andhra Pradesh: Employees Thanks To Cm Ys Jagan Over Announcing Gps - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలను ఉదారంగా పరిష్కరించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపినట్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్‌ బదులు మెరుగైన పెన్షన్‌ వచ్చేలా జీపీఎస్‌ తేవడం, వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయడానికి వేగంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, ఇవన్నీ ధైర్యం గల ముఖ్యమంత్రిగా జగన్‌ చేశారని తెలిపారు. ఆ తర్వాత కరోనా మహమ్మారితో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారని, పీఆర్సీ కూడా ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోయారని, ప్రభుత్వ ఉద్యోగులుగా వీటిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 

జీపీఎస్‌ దేశానికే రోల్‌మోడల్‌ 
జీపీఎస్‌లో ఉద్యోగులకు తొలుత బేసిక్‌లో 30 శాతం వరకే పెన్షన్‌ వచ్చేలా ప్రతిపాదనలు చేస్తే ముఖ్యమంత్రి స్వయంగా బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌ వచ్చేలా మార్పులు చేశారని, అలాగే సీపీఎస్‌లో లేని డీఆర్‌ను జీపీఎస్‌లోకి తెచ్చారని, గతంలోకన్నా మెరుగ్గా ఉందని సీపీఎస్‌ ఉద్యోగలు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్‌ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారని, ఏ రాష్ట్రంలోనూ జీపీఎస్‌ ప్రయోజనాలు లేవని చెప్పారు. సీఎం జగన్‌ నిర్ణయం సాహసోపేతమైనదని కొనియాడారు. 

వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 15 వేల కుటుంబాలకు మేలు చేశారని అన్నారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లో అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. జీపీఎస్‌ విధివిధానాలు వచ్చిన తరువాత ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలిగిపోతాయని చెప్పారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం ఆరు నెలలకోసారి వేతనాలు ఇచ్చేదని, ఈ ప్రభుత్వంలో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటే వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను నిర్మూలించారని గుర్తు చేశారు. 12వ పీఆర్సీని ముందుగానే ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతులు తెలిపినట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు.  

అశోక్‌బాబుకు సవాల్‌ 
ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టీడీపీ నేత అశోక్‌బాబు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారని, ఆయన బహిరంగ చర్చకు వస్తే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ, ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేసిందని, ఇంకా ఏమైనా ఉంటే అమలు చేయడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వం  రైగ్యులరైజ్‌ చేయలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ ధైర్యంగా 10 వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 

చదవండి: ఏపీకి చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో..

Advertisement

తప్పక చదవండి

Advertisement