3 రాజధానులపై హైకోర్టు తీర్పును రద్దు చేయండి

18 Sep, 2022 03:29 IST|Sakshi

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు

హైకోర్టు తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం

రాజధానిని నిర్ణయించుకునే స్వతఃసిద్ధ అధికారం ప్రతి రాష్ట్రానికీ ఉంది

ఆ చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఇక వ్యాజ్యాలన్నీ నిరర్థకం

అయినా కూడా హైకోర్టు వాటిపై విచారణ జరిపి తీర్పునిచ్చింది

కేంద్రం బదలాయించిన అధికారంతో సీఆర్‌డీఏ చట్టాన్ని తెచ్చారనడం సరికాదు

రాజ్యాంగంలోని రెండో లిస్ట్‌లో ఉన్న అధికారంతో రాష్ట్రం సీఆర్‌డీఏ చట్టాన్ని తెచ్చింది

రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనిదంటూ కేంద్రమే అఫిడవిట్‌ వేసింది 

సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలంటూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది.

రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికీ  తన రాజధానిని నిర్ణయించుకునే స్వతఃసిద్ధ అధికారం ఉంటుందని తెలిపింది.

సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను ఉపసంహరించిన తరువాత రాజధాని వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, అయినప్పటికీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపి తీర్పు వెలువరించిందని ప్రభుత్వం తన పిటిషన్‌లో నివేదించింది.

రాజ్యాంగంలోని అధికరణలు 3, 4లను అనుసరించి కేంద్రం తీసుకొచ్చిన చట్టం ద్వారా రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పడం లౌకిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 258 ద్వారా కేంద్రం బదలాయించిన అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం తెచ్చిందని హైకోర్టు తన తీర్పులో చెప్పిందని, వాస్తవానికి రాజ్యాంగంలోని లిస్ట్‌ రెండు 5వ ఎంట్రీలోని అధికారాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని తెచ్చిందని ప్రభుత్వం వివరించింది.

అటు రాష్ట్రం గానీ, ఇటు కేంద్రం గానీ కేంద్రం బదలాయించిన అధికారం ద్వారా సీఆర్‌డీఏ చట్టాన్ని చేసినట్లు ఎక్కడా చెప్పలేదని నివేదించింది. పైపెచ్చు రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోనిదంటూ కేంద్రమే లిఖితపూర్వకంగా అఫిడవిట్‌ రూపంలో హైకోర్టుకు నివేదించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో గుర్తు చేసింది. 

► అధికరణ 258 కింద ఉన్న కార్యనిర్వాహక, పాలన అధికారాలను మాత్రమే బదలాయించడం జరుగుతుంది కానీ శాసనాధికారాన్ని కాదని పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో తెలిపింది.

సీఆర్‌డీఏ చట్టాన్ని కేంద్రం బదలాయించిన అధికారం ద్వారానే చేశామని అనుకుంటే, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం ఏర్పాటైన కమిటీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని భావించాల్సి ఉంటుందని వివరించింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేయడానికి ఇది ఓ ప్రధాన కారణమని నివేదించింది. కేంద్రం ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా తీసుకున్న నిర్ణయం కేంద్ర చట్టానికి విరుద్ధమైనప్పుడు దాన్ని హైకోర్టు సమర్థించగలదా? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న అని తెలిపింది. 

► ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వర్తించలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో ప్రస్తావించింది. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం అమలుకు నిర్దేశించిన కాల పరిమితిని 2024 వరకు సీఆర్‌డీఏ ఇప్పటికే పొడిగించిందని, అందువల్ల ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరపాల్సిన ఎంత మాత్రం లేదని నివేదించింది.

ఒప్పందాలకు అనుగుణంగా సీఆర్‌డీఏ, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో ప్రశ్నించింది.

సీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌ 58, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించటాన్ని ప్రభుత్వం సవాల్‌ చేసింది.

రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన యజమానులకు అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో సవాల్‌ చేసింది.

సమగ్ర బిల్లుతో మళ్లీ ముందుకు వస్తాం
► శాసనసభకు చట్టం చేసే హక్కు లేదన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి: మంత్రి గుడివాడ
► తన రియల్‌ఎస్టేట్‌ బినామీల కోసం విద్వేషాలు సృష్టిస్తున్న చంద్రబాబు

సాక్షి, విశాఖపట్నం: రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసమే రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా జరిగే అభివృద్ధిని దీన్ని ద్వారా సుప్రీంకు తెలియజేశామన్నారు. శాసనసభకు చట్టంచేసే హక్కు లేదనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. మూడు రాజధానులపై మళ్లీ అసెంబ్లీలో సమగ్ర బిల్లుతో ముందుకు వెళతామని ప్రకటించారు. శనివారం విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

► హైకోర్టు తీర్పుపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించామని, శాసనసభకు రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ ఇచ్చిన తీర్పు ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బ తీసేవిధంగా ఉంది. ఆర్టికల్‌–3, 4 ప్రకారం రాజధాని ఎంపిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని గతంలో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యం.

► శాసనసభ ఉనికినే ప్రశ్నించే విధంగా తీర్పులు వస్తే రాష్ట్ర ప్రగతికి విఘాతం కలుగుతుంది.

► రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి జగన్‌ కృషి చేస్తుంటే, 29 గ్రామాల కోసం, తన రియల్‌ ఎస్టేట్‌ బినామీల కోసం చంద్రబాబు చిచ్చు, విద్వేషాలను రేకెతిస్తున్నారు.

► అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. అమరావతిని పూర్తిగా అభివృద్ధి చేయడానికి 2024 వరకు ప్రభుత్వానికి సమయం ఉంది.

మరిన్ని వార్తలు