విద్యా కార్యక్రమాలకు వెన్నుదన్ను | Sakshi
Sakshi News home page

విద్యా కార్యక్రమాలకు వెన్నుదన్ను

Published Sun, Mar 20 2022 5:17 AM

Andhra Pradesh Govt Further monitoring On Educational programs - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సంక్షేమం దిశగా అమలు చేస్తున్న మన బడి నాడు–నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద కార్యక్రమాలపై మండల విద్యాధికారుల ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షించనుంది. వీటితో పాటు బోధనాభ్యసన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయించేలా కార్యాచరణను రూపొందించింది. ఈ నేపథ్యంలో ఎంఈవోలకు విద్యేతర కార్యక్రమాల బాధ్యతలు అప్పగించొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ మెమో ద్వారా సూచించారు. 

పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యం 
రాష్ట్రంలో 61,390 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. వాటిలో 72,48,961 మంది విద్యార్థులున్నారు. ఈ స్కూళ్లలో 2,90,662 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం పలు పథకాల ద్వారా పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పాఠశాలల పనితీరును క్రమబద్ధీకరించేందుకు.. నియంత్రణ, పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నందుకు అర్హులైన ప్రతి తల్లికీ జగనన్న అమ్మఒడి కింద ఆర్థిక సాయం అందించడంతో పాటు పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ‘జగనన్న విద్యా కానుక’లు అందిస్తున్నారు.

విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తయారు చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యలో సమూలమైన సంస్కరణలు అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఫౌండేషనల్‌ విద్యకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలు, ఫౌండేషన్‌ పాఠశాలలు, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు, ప్రీ హైస్కూల్, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్‌ ప్లస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు ఈ సమగ్ర విద్యా, పరిపాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమర్థంగా వినియోగిస్తారు. 

ఇకపై విద్యా కార్యక్రమాలపైనే దృష్టి
జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు–నేడు వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు విద్యాశాఖలోని క్షేత్ర స్థాయిలో పటిష్ట పర్యవేక్షణకు సిబ్బంది సమస్య ఎదురవుతోంది. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ ఖరారు కానందున ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసే పరిస్థితి లేకపోయింది. దీంతో మండల విద్యాశాఖ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 264 ఎంఈవో పోస్టులు, 50 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టులున్నాయి.  

ప్రస్తుతం చాలా మంది మండల విద్యాశాఖాధికారులు మూడు లేదా నాలుగు మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారు ఎక్కువ పని చేయాల్సి వస్తోంది. సాధారణ విధులతో పాటు, అన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్లు మండల విద్యా అధికారులకు ఇతర శాఖేతర పనులు కేటాయిస్తున్నారు. ఆస్పత్రుల్లో కోవిడ్‌ కోసం నోడల్‌ అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా, ఎన్‌ఆర్‌జీఈఎస్‌ ఆడిటింగ్‌ అధికారి పనులు, ఓటీఎస్‌ పనులకు ప్రత్యేక అధికారులుగా తదితర బాధ్యతలను అప్పగిస్తున్నందున విద్యాశాఖ అధికారులు తగిన సమయాన్ని వెచ్చించలేక, విద్యాశాఖలో ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారని కలెక్టర్లకు పంపిన మెమోలో రాజశేఖర్‌ వివరించారు.

ఈ నేపథ్యంలో విద్యా శాఖలోని క్షేత్ర స్థాయి అధికారులందరికీ ఇతర శాఖేతర పనులను అప్పగించొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. వారు ఇకపై శాఖాపరమైన పనులకే పరిమితమవుతారు. విద్యా రంగంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలను  సమర్థంగా అమలు చేయడం కోసం పనిచేస్తారు. ఇకపై విద్యాభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్ర స్థాయి అధికారుల ద్వారా పర్యవేక్షణ మరింతగా పెరగనుంది.    

Advertisement
Advertisement