ఎకరం కూడా ఎండకూడదు.. ఇంధన శాఖకు ఆదేశాలు | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఎకరం కూడా ఎండకూడదు.. ఇంధన శాఖకు ఆదేశాలు

Published Tue, Apr 12 2022 3:31 AM

Andhra Pradesh Govt Special monitoring of agricultural electricity - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్‌ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట పొలం కూడా ఎండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు విద్యుత్‌ సరఫరాపై ఇంధన శాఖ అప్రమత్తమైంది. వేసవి, విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గృహ విద్యుత్‌కూ డిస్కమ్‌లు ప్రాధాన్యమిస్తున్నాయి. 

రోజూ 50 ఎంయూల కొరత
రాష్ట్రంలో 2018–19లో మొత్తం విద్యుత్‌ డిమాండ్‌ 63,605 మిలియన్‌ యూనిట్లు ఉండగా 2021–22 నాటికి 68,905 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. అంటే 8.3 శాతం పెరిగింది. గృహ వినియోగం 32 శాతం, పారిశ్రామిక వినియోగం 6 శాతం, వ్యవసాయ వినియోగం 16 శాతం చొప్పున పెరిగింది. గృహ విద్యుత్‌ డిమాండ్‌ 2018–19లో 14,681 ఎంయూలు ఉండగా 2021–22లో 19,355 మిలియన్‌ యూనిట్లకు చేరింది. పారిశ్రామిక రంగంలో డిమాండ్‌ 17,781 మిలియన్‌ యూనిట్ల నుంచి 18,844 మిలియన్‌ యూనిట్లకు చేరింది. వ్యవసాయ రంగంలో వాడకం 10,832 మిలియన్‌ యూనిట్ల నుంచి 12,720 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. వివిధ రంగాల్లో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ కారణంగా రోజూ 50 మిలియన్‌ యూనిట్ల మేర కొరత ఎదుర్కొంటున్నట్లు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు బహిరంగ మార్కెట్‌లో నిత్యం 30 మిలియన్‌ యూనిట్ల మేర కొనుగోలు చేస్తుండగా మరో 20 ఎంయూల కొరత నెలకొంది. ఈ నెలలో విద్యుత్‌ డిమాండ్‌ 6,720 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

కొరతకు రెండు ప్రధాన కారణాలు..
కోవిడ్‌ ప్రభావం తగ్గిన నేపథ్యంలో వివిధ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్‌ డిమాండ్‌ పెరగడానికి ఇది ఒక కారణం. రష్యా – యుక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో దేశంలో బొగ్గు కొరత కారణంగా కొద్ది నెలలుగా అసాధారణంగా పెరిగాయి. ఇది మరో ప్రధాన కారణం. గతంలో టన్ను బొగ్గు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఉండగా ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేలకు చేరింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ బొగ్గు కొరత నెలకొంది. విద్యుత్‌ డిమాండ్‌ను అందుకునేందుకు వివిధ రాష్ట్రాలు పవర్‌ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్‌ కొనుగోలుపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం యూనిట్‌ ధర పీక్‌ అవర్స్‌లో రూ.12 వరకూ ఉంది.

నెలాఖరుకు సాధారణ పరిస్థితి..
‘‘రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్‌ డిమాండ్‌ను అందుకునేలా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. విద్యుత్‌ కొరత కారణంగా పారిశ్రామిక వినియోగంపై కొంతమేర ఆంక్షలు విధించక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆదా చేసిన విద్యుత్‌ను వ్యవసాయ, గృహ అవసరాల కోసం సరఫరా చేస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విద్యుత్‌ కొరత సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందించడంలో రాజీ లేదు’’
– బి.శ్రీధర్, ఇంధన శాఖ  కార్యదర్శి 

Advertisement
Advertisement