చట్టప్రకారం జీఓ–1పై మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చు | Sakshi
Sakshi News home page

చట్టప్రకారం జీఓ–1పై మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చు

Published Sat, May 13 2023 4:51 AM

Andhra Pradesh High Court On GO-1 - Sakshi

సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా, కందుకూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాట కారణంగా పలువురు మరణించిన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మున్సిపల్, పంచాయతీ రోడ్లు, రోడ్‌ మార్జిన్‌లలో బహిరంగ సభల ఏర్పాటును నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2న జారీచేసిన జీఓ–1ని హైకోర్టు రద్దుచేసింది.

ఈ జీఓ చట్ట విరుద్ధమని తెలిపింది. అయితే, ఈ వ్యవహారంపై భవిష్యత్తులో చట్టానికి అనుగుణంగా తగిన మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చునంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

జీఓ–1ని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాకా రామకృష్ణ సంక్రాంతి సెలవుల్లో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ మరికొందరు కూడా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ఇదే సమయంలో రోడ్‌షోల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంలేదని, రాజకీయ సభలు, రోడ్‌షోలకు అనుమతినివ్వకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు బాలగంగాధర్‌ తిలక్‌ మరో పిల్‌ దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం శుక్రవారం తన తీర్పు వెలువరించింది.

వాక్‌ స్వాతంత్య్రపు హక్కే ఉత్కృష్టమైంది..
‘అన్ని స్వేచ్ఛల్లోకెల్లా వాక్‌ స్వాతంత్య్రపు హక్కు ఉత్కృష్టమైంది. నిర్వాహకులు తలపెట్టిన సమావేశం, ధర్నాలు, ఊరేగింపుల వల్ల శాంతికి విఘాతం కలుగుతుందని సంబంధిత అధికారి భావిస్తే, ఆ సమావేశాలు, ఊరేగింపుల నిర్వహణకు లైసెన్స్‌ తీసుకోవాలని, తాము విధించే షరతులకు లోబడి ఉండాలని నిర్వాహకులకు స్పష్టం చేయవచ్చు.

పబ్లిక్‌ రోడ్లు, వీధులపై ఆటంకాలు సృష్టిస్తే, వాటిని అడ్డుకునే అధికారం సంబంధిత అధికారికి ఉంది. కానీ, బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ఈ చట్టం ద్వారా పూర్తిగా నియంత్రించలేరు. జాతీయ, మున్సిపల్, పంచాయతీ రహదారులపై సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తే వాహనాలు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ జీఓ జారీచేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

వాస్తవానికి ప్రభుత్వానిది మంచి ఉద్దేశమే. కానీ, వాస్తవం ఏమిటంటే, రోడ్లపై శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కులను ఉన్నత న్యాయస్థానాలు దశాబ్దాల క్రితమే గుర్తించాయి. ఓ  ప్రమాదం లేదా ఘటనను సమావేశం లేదా ఊరేగింపు హక్కును హరించేందుకు కారణంగా చూపడానికి వీల్లేదు. ఈ సమావేశాలు, ఊరేగింపులకు మన రాజకీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.  

Advertisement
Advertisement