అంకెల గారడీతో అసత్యాలు | Sakshi
Sakshi News home page

అంకెల గారడీతో అసత్యాలు

Published Tue, Jun 6 2023 8:46 AM

Andhra Pradesh: Minister Adimulapu Suresh Responds False Allegations By Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్‌ సీఎస్‌) శ్రీలక్ష్మితో కలిసి మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో వేల కోట్లతో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ఎల్లో మీడియా అంకెలను వక్రీకరిస్తూ, అసత్య కథనాలతో ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు సీఎఫ్‌ఎంఎస్‌కు వచ్చిన బిల్లును విడుదల చేస్తున్నామని చెప్పారు. పురపాలక సంస్థల్లో చేపట్టిన 2,760 పనులకు రూ.510.46 కోట్లు చెల్లించామన్నారు. పలాస – కాశీబుగ్గ, తాడిగడప, సాలూరు, గుంటూరు, జంగారెడ్డిగూడెం, పిడుగురాళ్ల, ఎర్రగుంట్లలో మొత్తం 269 పనులకు రూ.32.55 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. తాడేపల్లి–మంగళగిరి మున్సిపల్‌ కార్పొషన్‌లో ఫేజ్‌ 1, ఫేజ్‌–2 జనరల్‌ ఫండ్స్‌ బిల్లులు, 14, 15 ఆరి్థక సంఘం నిధులుతో చేపట్టిన పనులకు రూ. 37.06 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో లేదన్నారు. బిల్లుల జాప్యంతో అభివృద్ధి నిలిచిపోతోందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 123 పట్టణాలకుగాను ఏడింటిలో పనులు, బిల్లులనే ప్రస్తావించారని, అంటే మిగిలిన వాటిలో అభివృద్ధి జరుగుతోందనే అర్థమని చెప్పారు.

పనులు చేసేందుకు చిన్న కాంట్రాక్టర్లు ముందుకు రానందునే చిన్న పనులను ఒక ప్యాకేజీగా మార్చి పెద్ద కాంట్రాక్టరుకు ఇచ్చేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సాలూరులో 12 పనులకు రూ.15 లక్షల బిల్లులు ఉన్నాయని, అంటే ఒక పనికి రూ.లక్ష వరకు ఉంటుందని, దీనిని కూడా భూతద్దంలో చూపించడం దుర్మార్గమని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమృత్‌ 1.0లో ఇప్పటికే రూ.3,500 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, అమృత్‌ 2.0లో రూ. 5 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్టు వివరించారు. పన్నులు సకాలంలో చెల్లించని వారిపై వడ్డీల భారం పెరుగుతోందని, దానిని కూడా ప్రభుత్వం మినహాయించిందని, ఇందుకోసం రూ.3 వేల కోట్లు వడ్డీ భారాన్ని మోస్తోందని తెలిపారు. 

కాంట్రాక్టర్లు సంతృప్తితో ఉన్నారు
బిల్లుల చెల్లింపుపై కాంట్రాక్టర్లు సంతృప్తితో ఉన్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి చెప్పారు. పట్టణాల్లో సాధారణ పనులకే కాకుండా.. 528 అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పనులకు కూడా రూ.187 కోట్లు చెల్లించామన్నారు. యూజర్‌ చార్జీలు ఇవ్వడానికి ప్రజలు ముందుకొస్తుంటే మీడియాకు ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. 

చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే!

Advertisement
Advertisement