శివార్లలో శరవేగంగా.. | Sakshi
Sakshi News home page

శివార్లలో శరవేగంగా..

Published Fri, Apr 29 2022 5:08 AM

Andhra Pradesh Revenue from registrations increased by 43 percent - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విజయవాడ చుట్టపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా కానూరు, తాడిగడప, పోరంకి, కంకిపాడు, గన్నవరం, నున్న, ఇబ్రహీంపట్నం, భవానీపురం తదితర ప్రాంతాల్లో ‘రియల్‌’ జోరు సాగుతోంది. బైపాస్‌ రోడ్ల నిర్మాణం ఇందుకు దోహదపడుతున్నాయి. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈ పనులు తుదిదశకు చేరాయి. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పుడు విజయవాడ తూర్పు బైపాస్‌ పనులపై దృష్టిసారించారు. ఆయన విజ్ఞప్తి మేరకు, ఇటీవల కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడంతో భూసేకరణ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ కారణాలతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక రాజధానితో సంబంధం లేకుండా, కరోనా కష్టకాలంలో సైతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. ఎంతలా అంటే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ ఏడాది 43 శాతం రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.

‘తూర్పు’ వైపు ఆసక్తి..
మరోవైపు.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి నిర్మాణం పూర్తికావడం.. తూర్పు రింగు రోడ్డుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేయటం, చోడవరం వద్ద బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించటంతో ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గతంలో సీఆర్‌డీఏ ప్లాన్లు ఇచ్చేది. దీంతో ప్రజలు ఇబ్బంది పడేవారు. అయితే, వైఎస్సార్‌సీపీ సర్కారు తాడిగడపను మున్సిపాలిటీ చేయడంతో జీ+3 ప్లాన్ల మంజూరు అధికారం మున్సిపాలిటీకి వచ్చింది. దీంతో ఇళ్ల ప్లాన్ల మంజూరు ఇప్పుడు ఈ ప్రాంతంలో తేలికగా మంజూరవుతున్నాయి. ఇక నగరాలకే పరిమితమైన అపార్టుమెంట్లు నేడు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. రూ.30 లక్షల నుంచి రూ కోటి వరకు ధర పలుకుతున్నాయి. వీటికితోడు విల్లాల నిర్మాణం కూడా జోరుగా జరుగుతున్నాయి. 

అభివృద్ధి దిశగా శివార్లు.. 
జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ప్రభుత్వ విధానాలతో పట్టణ శివారు ప్రాంతాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒకప్పుడు ఇంటి స్థలాలు కొనాలంటే పట్టణాల వైపు చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం శివారు ప్రాంతాల లక్ష్యంగా విస్తరిస్తోంది.    
– నర్రా రమేష్‌బాబు, నెప్పల్లి, కంకిపాడు మండలం 

అందుబాటులో ధరలు
ఒకప్పుడు విజయవాడ నగర శివారు ప్రాంతమైన గట్టు వెనుక ప్రాంతంలోని భవానీపురం, విద్యాధరపురం ఇటీవల అభివృద్ధి బాట పట్టాయి. అదే విధంగా గొల్లపూడి కూడా విస్తృతంగా అభివృద్ధి చెందింది. ధరల విషయానికి వస్తే.. సామాన్య, మధ్య తరగతి ప్రజలతోపాటు చిరు వ్యాపారులకు అందుబాటులో ఉంటున్నాయి.
 – కీసర సుబ్బారెడ్డి, భవానీపురం, విజయవాడ

రియల్‌ వ్యాపారం పుంజుకుంది
ఇటీవల కాలంలో రియల్‌ వ్యాపారం తిరిగి పుంజుకుంది. మధ్య తరగతి ప్రజలు ఇళ్లు కట్టుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. అపార్టుమెంట్ల నిర్మాణం చాలా వేగంగా ఉంది. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి మరింత చేయూతనిస్తే చాలామందికి సొంతింటి కల నెరవేరుతుంది.
– బొర్రా శ్రీనివాసరావు, రియల్టర్, పోరంకి, విజయవాడ

రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది
ఈ ఏడాది ఉమ్మడి కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2020– 21లో రూ.644 కోట్ల ఆదాయం రాగా, మొన్న మార్చి నాటికి రూ.1,056 కోట్లు.. అంటే 40 శాతానికిపైగా ఆదాయం పెరిగింది. ఈ రిజిస్ట్రేషన్లు విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కంకిపాడు, గుణదల, పటమట, గాంధీనగర్, నున్న వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.
 – రవీంద్రనాథ్, డీఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ, విజయవాడ 

Advertisement
Advertisement