పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం

Published Sun, Jul 17 2022 3:29 AM

Andhra Pradesh Strategic Partnership Summit with Western Australia - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌.. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) మధ్య పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ నగరంలో ‘వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు’ శనివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు బుగ్గన, గుడివాడ హాజరుకాగా.. పశ్చిమ ఆస్ట్రేలియా తరఫున డిప్యూటీ ప్రీమియర్‌ రోజర్‌ కుక్, అంతర్జాతీయ విద్య, కల్చరల్‌ మంత్రి డేవిడ్‌ టెంపుల్‌మేన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా.. ఏపీని సిస్టర్‌ స్టేట్‌గా గుర్తించడంతోపాటు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయడం.. పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతిక సహకారం, నైపుణ్యం అందించే అంశాలపై ఇరు ప్రాంతాల ప్రతినిధులు చర్చించారు. ముందుగా.. పరిశ్రమలు, అంతర్జాతీయ విద్య, గనులు మొదలైన అంశాలపై వేర్వేరుగా సెషన్లు నిర్వహించారు. ఏపీ, ఆస్ట్రేలియాలో ఉన్న అవకాశాలపై చర్చించారు. అనంతరం జరిగిన వ్యూహాత్మక సదస్సులో పలు అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ)లు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు బుగ్గన, గుడివాడతోపాటు ఆస్ట్రేలియా ప్రతినిధి రోజర్‌ కుక్‌ మాట్లాడారు.

నైపుణ్యాభివృద్ధి దిశగా ఏపీ..
బుగ్గన ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జరిగితే.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మల్టీనేషనల్‌ ఏజెన్సీల సహకారంతో అడుగులు వేస్తున్నాం. అంతర్జాతీయ విద్య విషయంలోనూ రాష్ట్రం పురోగమించింది. గడిచిన మూడేళ్ల నుంచి రాష్ట్ర జీడీపీ రేటు వృద్ధి చెందుతోంది. వాణిజ్య రంగంలో ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు ఆధునీకరించుకుంటూ అడుగులు వేస్తున్నాం.

ముఖ్యంగా వివిధ కీలక రంగాల్లో సాంకేతికతని అందిపుచ్చుకుంటున్నాం. ఏపీలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదు. దేశంలోకంటే ఎక్కువమంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఇక్కడ ఉన్నారు. వొకేషనల్‌ ట్రైనింగ్‌ అందితే విద్యార్థులు మరింత నైపుణ్యవంతులవుతారు. ఈ దిశగా పశ్చిమ ఆస్ట్రేలియా ఆలోచన చేయాలి. అదేవిధంగా మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు, గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్ల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. అన్ని రంగాల్లోనూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై దృష్టిసారించాలి.

ఏపీ–ఆసీస్‌ బంధంతో మార్కెట్‌ వృద్ధి..
మంత్రి గుడివాడ ఏమన్నారంటే.. వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు ద్వారా భారత్‌–పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఇదే గొప్ప అడుగు. రాబోయే ఇరవై ఏళ్లలో ఇరు ప్రాంతాల మధ్య మార్కెట్‌ వృద్ధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఫలితాల్లో రాష్ట్రం నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఏపీ, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య కార్యకలాపాల వృద్ధి 69.08 శాతంగా ఉంది.

రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లని ఏర్పాటుచేస్తున్నాం. మెరైన్‌ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. కార్గో హ్యాండ్లింగ్‌లోనూ ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉంది. పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు సింగిల్‌ విండో విధానం ద్వారా 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నాం. ఐటీ రంగంలో పెట్టుబడులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయి. భూములూ సిద్ధంగా ఉన్నాయి. బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌తో ఐటీ పరిశ్రమలకు మంచి వాతావరణాన్ని అందిస్తున్నాం.

కలిసి పనిచేసి చరిత్ర సృష్టిద్దాం : రోజర్‌కుక్‌
సోదర రాష్ట్రంతో కలిసి పనిచేసి చరిత్ర సృష్టించేందుకు, సరికొత్త ఆలోచనల్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ సదస్సుతో రెండు ప్రభుత్వాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగానికి ఏపీ నిలయంగా ఉంది. పాడి, మత్స్య సంపద, ఆక్వాకల్చర్‌ రంగాల్లో ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ప్రపంచంలోనే ప్రముఖ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌ విద్య, పరిశోధనల్లో అవకాశాలను అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలతో ఇరు దేశాలు అనేక రంగాలలో అవకాశాలను పెంపొందించుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌తో సుసంపన్నమైన భవిష్యత్తును పశ్చిమ ఆస్ట్రేలియా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. 

ఏపీ, డబ్ల్యూఏ మధ్య ఎనిమిది ఒప్పందాలు.. 
ఏపీలో గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఎనిమిది అంశాలపై రోజర్‌ కుక్‌ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం.. ఏపీ మంత్రుల సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశారు. ఒప్పందాల వివరాలివీ..
► అంతర్జాతీయ విద్య, నైపుణ్య సహకారం కోసం ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (ఏఐసీఎస్‌) డైరెక్టర్‌ పర్సెస్‌ ష్రాఫ్‌తో ఒప్పందం. 
► విద్యుత్‌కు సంబంధించిన సవాళ్లను అధిగమించే విధానాలలో పరిశోధనాత్మక తోడ్పాటు కోసం ‘ఫ్యూచర్‌ బ్యాటరీ’తో ఏపీఈడీబీ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం. 
► ఏరో స్పేస్‌ రంగానికి చెందిన అంతరిక్ష సాంకేతిక అంశంలో పరస్పర సహకారం కోసం ‘స్పేస్‌ ఏంజిల్‌’ సంస్థతో ఏపీఈడీబీ ఎంఓయూ. 
► విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘విలేజ్‌ ఎనర్జీ’ సంస్థ సీఈఓ వేన్‌ లూబిస్‌ కాస్‌తో ఎంఓయూ.
► నైపుణ్యం, వొకేషనల్‌ ట్రైనింగ్‌కి సంబంధించిన సహకారం కోసం ‘ఫినిక్స్‌ అకాడమీ’తో ఒప్పందం.
► పశ్చిమ ఆస్ట్రేలియాలోని విద్యుత్‌ రంగానికి సంబంధించిన ‘ఆస్ట్రేలియన్‌ ఎనర్జీ స్టోరేజ్‌’  కంపెనీతో అవగాహన. 
► వైద్య పరికరాల తయారీ సంస్థ ‘హెల్త్‌ ఇంటిగ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌’తో అత్యాధునిక పరికరాల తయారీకి ఎంఓయూ.
► ‘హెల్త్‌ ఇంటిగ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే వైద్య పరికరాల తయారీ సంస్థతో ఏపీఈడీబీ ఒప్పందం. పలు కీలక అంశాల్లో పరస్పర అవగాహనతో కలిసి పనిచేయడానికి అంగీకారం.
► మత్స్య రంగానికి సంబంధించిన అంశాలలో కలిసి పనిచేయడానికి వీలుగా పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన ‘ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ’ (సీసీఐడబ్ల్యూఏ) వాణిజ్య పెట్టుబడుల హెడ్‌ మైకేల్‌ కార్టర్‌తో ఏపీఈడీబీ ఒప్పందం. 

ఇక ఈ సదస్సులో ఏపీఎస్‌ఎస్డీసీ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ గుమ్మళ్ల సృజన, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి.. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌ గౌర్, విద్యుత్‌ శాఖ జేఎండీ పృథ్వితేజ్‌ ఇమ్మాడి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున్, ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్, రీజినల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ బాలయ్య, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌బాబు, ఆంధ్రప్రదేశ్‌ సీఐఐ చైర్మన్‌ నీరజ్‌ శారద, ఇండియ గల్ఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌–ట్రేడ్‌ కమిషనర్‌ నషిద్‌ చౌదరి, ఏపీ ఈడీబీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌తో పాటు పరిశ్రమలు, ఏపీఐఐసీ అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement