ఎగుమతుల్లో ‘ఎగిసిన’ ఏపీ  | Sakshi
Sakshi News home page

ఎగుమతుల్లో ‘ఎగిసిన’ ఏపీ 

Published Tue, Jul 18 2023 4:37 AM

Andhra Pradesh Tops In Index Ranks announced by NITI Aayog - Sakshi

సాక్షి, అమరావతి: నీతి ఆయోగ్‌ ఏటా ప్రకటించే ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరీ సోమవారం విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోస్థానం ఎగబాకింది.

ఈ ర్యాంకుల్లో 80.89 పాయింట్లతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిస్తే, ఆ తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (78.20), కర్ణాటక (76.36), గుజరాత్‌ (73.22), హరియాణ (63.65), తెలంగాణ (61.36), ఉత్తరప్రదేశ్‌ (61.23) ఉన్నాయి. 2020లో 20వ స్థానంలో ఉన్న ఏపీ .. కేవలం రెండేళ్లలో 12 స్థానాలను మెరుగుపర్చుకుని సత్తా చాటింది.  ఇక కోస్తాతీరం కలిగిన రాష్ట్రాలు 8 ఉంటే ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో నిలిచింది. ఎగుమతుల పాలసీలో 99.52 పాయింట్లతో 4వ స్థానం, ఎగుమతుల ఎకోసిస్టమ్‌లో 6వ స్థానం దక్కించుకుంది. 

టాప్‌ 100లో రాష్ట్రం నుంచి 8 జిల్లాలు.. 
దేశం నుంచి 2021–22లో 422 బిలియన్‌ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా ఏపీ వాటా 4.58 శాతం (19 బిలియన్‌ డాలర్లు) ఉందని నివేదిక పేర్కొంది. 127 బిలియన్‌ డాలర్ల ఎగుమతులతో గుజరాత్‌ మొదటిస్థానంలో ఉంది. దేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు జరుగుతున్న టాప్‌ 100 జిల్లాల్లో రాష్ట్రం నుంచి 8 ఉమ్మడి జిల్లాలకు చోటు దక్కింది.

అందులో విశాఖకు టాప్‌ 10లో తొమ్మిదో స్థానం దక్కగా ఉమ్మడి తూర్పుగోదావరికి 24వ స్థానం దక్కింది. ఎగుమతులు ఇన్‌ఫ్రాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పనితీరు బాగుందని, అలాగే గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఎగుమతిదారులకు రుణ లభ్యతకూడా భారీగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. 
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా నిర్దిష్టమైన పాలసీలను రూపొందించి అమలు చేయడం ద్వారా ఏపీ ర్యాంకులు మెరుగుపడ్డాయని నీతిఆయోగ్‌ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ జోన్స్, అగ్రిఎక్స్‌పోర్ట్‌ జోన్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఎగుమతిదారుల సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం వర్క్‌షాప్స్, ట్రేడ్‌ ఫెయిర్స్‌ను నిర్వహించిందంటూ కితాబునిచ్చింది.

టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడంతో అంతర్జాతీయంగా రాష్ట్రం పోటీపడటానికి దోహదం చేసిందని, అది రాష్ట్ర ఎగుమతుల్లో భారీ వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. రాష్ట్రంలోకి విదేశీపెట్టుబడుల రాక పెరుగుతున్నప్పటికీ.. ఎగుమతుల ఎకోసిస్టమ్‌కు అనుగుణంగా వ్యాపార వాతావరణం మెరుగుపర్చుకుంటే ఎగుమతుల్లో మరింత వృద్ధి నమోదు చేయవచ్చని సూచించింది.

కాగా, ఎగుమతులు పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, సాధిస్తున్న ఫలితాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకులు నిర్ధారిస్తారు. 2020లో 20వ స్థానంలో ఉన్న ఏపీ.. 2021లో 9వ ర్యాంకుకు, ఈ ఏడాది మరో ర్యాంకుకు ఎగబాకి అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోందని, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషి ఎంతో ఉందని నిపుణులు చెబుతున్నారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement