డీఆర్డీవో మందుల కొనుగోలు

22 May, 2021 04:27 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు..

వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడి

మే నెలలో 13,41,700 కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు, 3,43,930 కొవాగ్జిన్‌ డోసులను కొనుగోలు చేశాం

కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 చికిత్స కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసిన మందులు కొనుగోలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా శనివారం జరిగే కొనుగోలు కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. మంగళగిరిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాల నిమిత్తం మే నెలలో 13,41,700 కోవిషీల్డ్‌ డోసులను, 3,43,930 కోవాగ్జిన్‌ డోసులను సొంతంగా కొనుగోలు చేశామని తెలిపారు. మే నెలలో 16.85 లక్షల డోసులు, జూన్‌ నెలకు సంబంధించి 14.86 డోసులు కలిపి మొత్తం 31.71 లక్షల డోసులు కొనుగోలు చేశామని వివరించారు. 

ఆయుర్వేద మందు ఫలితాలపై శాస్త్రీయ అధ్యయనం
కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయతపై పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్రస్థాయి అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని సింఘాల్‌ చెప్పారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు కృష్ణపట్నం వెళ్లి అక్కడి వారితో మాట్లాడటమే కాకుండా ఆయుర్వేద మందును హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో పరీక్షలు కూడా చేయించారన్నారు. ఇందులో నష్టం కలిగించే వివరాలు తెలియరాలేదన్నారు. ప్రజలు నమ్ముతున్నా.. సైంటిఫిక్‌గా రుజువు కావాల్సి ఉందన్నారు. ఆయుష్‌ కమిషనర్, కొందరు సాంకేతిక అధికారులు ప్రస్తుతం కృష్ణపట్నంలోనే ఉన్నారని, మందును వినియోగించిన కరోనా బాధితులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని రాష్ట్ర అధికారులకు శనివారం స్థానిక తయారీదారులు వివరిస్తారన్నారు. విజయవాడలో ఉన్న ఆయుర్వేద విభాగం ప్రాంతీయ అధికారులు కొందరు సోమవారం కృష్ణపట్నం వెళ్లి శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన జరుపుతారని చెప్పారు. ఆ తరువాతే దీని ఫలితాలపై అవగాహన వస్తుందన్నారు.

600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగం
రాష్ట్రవ్యాప్తంగా 6,408 ఐసీయూ బెడ్లు ఉండగా.. 5,889 కరోనా బాధితులతో నిండాయని తెలిపారు. ఆక్సిజన్‌ బెట్లు 23,876 బెడ్లు ఉండగా.. 22,492 బెడ్లు రోగులతో నిండాయన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 18 వేల మంది చికిత్స పొందుతున్నారన్నారు. రోజువారీ కేటాయింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి  గడచిన 24 గంటల్లో 600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగించుకున్నట్టు తెలిపారు. గడచిన 24 గంటల్లో  ప్రభుత్వాస్పత్రుల్లో 24,352, ప్రైవేట్‌ ఆస్పత్రులకు 16,713 రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు సరఫరా చేశామన్నారు. 10 రోజుల క్రితం వరకు కాల్‌ సెంటర్‌కు 18 వేల ఫోన్‌ కాల్స్‌ వరకూ వచ్చేవని, ఇపుడా సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు. గడచిన 24 గంటల్లో 10,919 ఫోన్‌ కాల్స్‌ రాగా.. అందులో 3,508 కాల్స్‌ వివిధ సమాచారాలకు సంబంధించి ఉన్నాయన్నారు.

ఆరోగ్యశ్రీ కింద 77 శాతం మందికి ఉచిత వైద్యం
కోవిడ్‌ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాల వివరాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్షా నిర్వహించారని సింఘాల్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో 38,763 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 28,189 మంది (77 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందుతున్నారన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 23,03,655 మందికి రెండు వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చామని, 30,48,265 మందికి ఒక డోసు ఇచ్చామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి 1,33,532 మందికి కోవాగ్జిన్‌ రెండో డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి మే 15 నుంచి జూన్‌ 15 వరకూ 11,18,000 డోసులు రావాల్సి ఉందన్నారు.  

మరిన్ని వార్తలు