రుణ లక్ష్యం రూ.4.43 లక్షల కోట్లు | Sakshi
Sakshi News home page

రుణ లక్ష్యం రూ.4.43 లక్షల కోట్లు

Published Wed, May 17 2023 3:28 AM

The annual loan target was finalized in the SLBC meeting - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ 2023–24 వార్షిక రుణ లక్ష్యాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) ఖరారు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4.43 లక్షల కోట్ల రుణ ప్రణాళికను నిర్దేశించుకోగా వ్యవసాయ రంగానికి అత్యధికంగా రూ.2.31 లక్షల కోట్లను కేటాయించింది.

మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. గత ఏడాది వార్షిక రుణ లక్ష్యం రూ.3,19,481 కోట్లు కాగా ఈ ఏడాది 39 శాతం అధికంగా కేటాయించారు. గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి రూ.3,99,289 కోట్ల రుణాలను (125 శాతం) మంజూరు చేయడం గమనార్హం. 

ఎన్టీఆర్‌ జిల్లాకు అత్యధికం..
ఈ ఏడాది వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ.2.31 లక్షల కోట్లలో స్వల్పకాలిక రుణాలకు రూ.1.48 లక్షల కోట్లు, టర్మ్‌ లోన్లు, వ్యవసాయ అనుబంధ రుణాలకు రూ.83 వేల కోట్లు (పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.9 వేల కోట్లు) నిర్దేశించారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.69 వేల కోట్లు (సూక్ష్మ పరిశ్రమలకు రూ.36 వేల కోట్లు), ఇతర ప్రాధాన్యత రంగానికి రూ.23 వేల కోట్లు కేటాయించారు. ప్రాధాన్యేతర రంగానికి మరో రూ.1.20 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని ఎస్‌ఎల్‌సీబీ నిర్దేశించుకుంది.

రంగాల వారీగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వ్యవసాయ స్వల్పకాలిక రుణాల్లో 22 శాతం, టర్మ్‌ లోన్లు, వ్యవసాయ అనుబంధ రుణాల్లో 92 శాతం (వెరసి వ్యవసాయ రంగానికి 40 శాతం), ఎంఎస్‌ఎంఈలకు 38 శాతం, ఇతర దిగువ ప్రాధాన్యత రంగానికి 37 శాతం, ప్రాధాన్యేతర రంగానికి 43 శాతం చొప్పున రుణ కేటాయింపులు పెరిగాయి. జిల్లాలవారీగా చూస్తే అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాకు 12.93 శాతం రుణాలను కేటాయించారు.

బ్యాంకుల వారీగా కేటాయింపులు..
వార్షిక రుణ ప్రణాళికలో బ్యాంకుల వారీగా పరిశీలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు 65 శాతం (రూ.2,88,000 కోట్లు), ప్రైవేట్‌ రంగ బ్యాంకులు 18 శాతం (రూ.78,250 కోట్లు), ఆర్‌ఆర్‌బీలు 10 శాతం (రూ.45,000 కోట్లు), సహకార రంగ బ్యాంకులకు 7 శాతం (రూ,31,750 కోట్లు) చొప్పున నిర్దేశించారు.

Advertisement
Advertisement