‘గగన్‌యాన్‌’లో మరో కీలక పరీక్ష విజయవంతం  | Sakshi
Sakshi News home page

‘గగన్‌యాన్‌’లో మరో కీలక పరీక్ష విజయవంతం 

Published Sat, Aug 12 2023 3:55 AM

Another key test in Gaganyan is successful - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబంధించి మరో కీలక పరీక్ష విజయవంతమైంది. ఈ నెల 8వ తేదీన డ్రోగ్‌ ప్యారాచూట్లకు ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో శుక్రవారం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

గగన్‌యాన్‌ మిషన్‌లో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి చేరుకునేందుకు డ్రోగ్‌ ప్యారాచూట్‌ విస్తరణ పరీక్షల అవసరం ఉందని తెలిపింది. క్రూ మాడ్యూల్‌ను స్థిరీకరించడానికి, రీ–ఎంట్రీ సమయంలో దాని వేగాన్ని తగ్గించి సురక్షితంగా తీసుకురావడానికి ఈ ప్యారాచూట్‌ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించింది.

గగన్‌యాన్‌ క్రూ మాడ్యూల్‌ మందగింపు వ్యవస్థ కోసం సంక్లిష్టమైన ప్యారాచూట్‌ స్వీకెన్స్‌లో మొత్తం 10 వరకు ఉంటాయని పేర్కొంది. గగన్‌యాన్‌ ప్రయోగంలో క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించి, దానిని మళ్లీ భూమి మీదకు తీసుకువచ్చేందుకు, సురక్షితంగా ల్యాండింగ్‌ చేసేందుకు ఈ ప్యారాచూట్‌లు కీలక పాత్ర పోషిస్తాయని, అందుకు వీటి పనితనాన్ని పరీక్షించుకుని నిర్ధారించుకుంటున్నామని ఇస్రో వివరించింది.  

Advertisement
Advertisement