Another Low-Pressure At Bay Of Bengal, Two Days Rain Forecast To AP - Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన

Published Sat, Jul 22 2023 10:46 AM

Another Low Pressure At Bay Of Bengal Two Days Rain Forecast To AP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలంగాణలో స్కూల్స్‌కు కూడా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు.. ఇంకా రెండు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

వివరాల ప్రకారం.. ఈనెల 24వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

► ఇదిలా ఉండగా.. గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద 11.5 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. డెల్టా పంట కాల్వలకు 11వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇదే సమయంలో సముద్రంలోకి 9.32 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు.. రాజమండ్రి వద్ద గోదావరి ఘాట్లను ఆనుకుని నది ప్రవహిస్తోంది. గోదావరి పాయలు వశిష్ట, గౌతమి, వైనతేయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో, విలీన మండలాల్లో కొండవాగులు పోటెత్తుతున్నాయి. నాలుగు మండలాల పరిధిలో 100 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

► ఇక, పోలవరం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. స్పిల్‌వే వద్ద 32.315 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. 48 గేట్ల ద్వారా 6,75,910 క్యూసెక్యుల నీరు విడుదలవుతోంది. స్పిల్‌ వే దిగువన 23.470 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. 

► కాగా, యానాం-ఎదుర్లంక వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. యానాం వద్ద 2 మీటర్ల ఎత్తు వరకు గౌతమి నది చేరుకుంది. దీంతో, అధికారులు.. లంక గ్రామాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

ఇది కూడా చదవండి: తిరుమల: ఆగస్టు, సెప్టెంబర్‌కు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Advertisement
Advertisement