Sakshi News home page

300 సెల్‌టవర్లను ప్రారంభించిన సీఎం జగన్‌

Published Thu, Jan 25 2024 2:20 PM

AP CM YS Jagan Launch 300 Cell Towers - Sakshi

సాక్షి, అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్‌ ఏర్పాటయ్యాయి.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘‘ఇవాళ 300 టవర్లు, జూన్‌లో 100 టవర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరం. ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగం. మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3,119 కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించడం జరిగింది. 5,549 గ్రామాలకు పూర్తి మొబైల్‌ టెలికాం సేవలు అందుతాయి. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తాయి. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయి. ఈ ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతుంది. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌, ఇంగ్లిషు మీడియం స్కూల్స్‌ ఇవన్నీకూడా గ్రామ రూపురేఖలను మారుస్తాయి. ఈ ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయి’’ అని సీఎం తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్‌ (ఐటీశాఖ) డైరెక్టర్‌ సి చంద్రశేఖర్‌ రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్‌ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.

వర్చువల్‌ సమావేశంలో గిరిజనులు మాట్లాడారు. ఏమన్నారంటే...వారి మాటల్లోనే..

మళ్లీ మీరే రావాలి..
సార్.. మేం గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాకు పాడేరు హెడ్‌ క్వార్టర్‌కు వెళ్ళాల్సి వచ్చేది ప్రతి విషయానికి గతంలో ఫోన్‌ చేయాలంటే కొండల పైకి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా మా గ్రామానికే సెల్‌టవర్స్‌ వేశారు. మాకు సిగ్నల్‌ కూడా వచ్చింది. మా గ్రామస్తులు అంతా సంతోషంగా ఉన్నారు, మాకు గతంలో సచివాలయం అంటే, కలెక్టర్‌ అంటే, వలంటీర్‌ అంటే ఏం తెలీదు, కానీ ఇప్పుడు అందరి గురించి తెలిసింది. జగనన్న మీరు మా బాధలు గమనించి మాకు సాయం చేస్తున్నారు.

గతంలో రోడ్లు లేవు, కానీ ఇప్పుడు చక్కటి రోడ్లు వేశారు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి, మీరు మా వెంట ఉన్నామన్న భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు, జగనన్నా మీరు మాకు అన్నీ ఇస్తున్నారు, మేం మీ పథకాల ద్వారా లబ్ధిపొంది మా కాళ్ళపై మేం నిలబడ్డాం, మేమంతా కూడా మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాం. గతంలో మీరు పాడేరు వచ్చినప్పుడు చూడాలనుకుని చూడలేకపోయాను, ఇప్పుడు నేరుగా మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ అన్నా
-చిట్టెమ్మ, గిరిజన మహిళ, పాడేరు మండలం, ఏఎస్‌ఆర్‌ జిల్లా

చాలా సంతోషంగా ఉంది..
అన్నా, మా గిరిజన గ్రామాలకు ఫోన్‌ సిగ్నల్‌ లేదు. 5 కిలోమీటర్లు వెళ్లి ఫోన్‌ చేయాల్సి వచ్చేది. ఏదైనా ప్రమాదం జరిగినా అంబులెన్స్‌కి చెప్పడానికి కూడా ఫోన్‌ సిగ్నల్‌ ఉండేది కాదు, మా బంధువుల కష్టసుఖాలు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు నేరుగా వారితో మాట్లాడుతున్నాం. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. నేరుగా టీచర్స్‌తో మాట్లాడుతున్నాం. గవర్నమెంట్‌ స్కీమ్స్‌ గురించి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు నేరుగా జగనన్నకు చెబుదాం నెంబర్‌ 1902 కి కాల్‌ చేసి మాట్లాడగానే మా సమస్య పరిష్కారం అయింది.

గతంలో ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్‌ ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. ఇప్పుడు మాత్రం అన్నీ వెంటనే తెలిసిపోతున్నాయి. మా సచివాలయంలో సిగ్నల్‌ లేక ఇబ్బందులు పడేవారు, ఇప్పుడు మీ చొరవ వల్ల ఇంటినుంచే అన్నీ తెలుసుకుంటున్నాం, ఏదైనా మా సచివాలయంలో ఇస్తున్నారు. బ్యాంకులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే డబ్బు కూడా తీసుకుంటున్నాం, మాకు సెల్‌ టవర్‌ వచ్చిన తర్వాతే నిజంగా సంతోషంగా ఉంది. నిన్నటి కన్నా నేడు, నేటి కన్నా రేపు బావుండాలి, మీరు మళ్లీ వస్తేనే మాకు చాలా బావుంటుంది. మళ్లీ మీరే రావాలని కోరుకుంటున్నాం
-చలపతిరావు, గిరిజనుడు, పార్వతీపురం మన్యం జిల్లా

Advertisement
Advertisement