నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

3 Jul, 2022 04:26 IST|Sakshi

ఈఏపీసెట్‌–2022 నిర్వహణపై పక్కా నిబంధనలు

గంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు

తెలంగాణలోనూ రెండు పరీక్ష కేంద్రాలు

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌–2022 పరీక్షలను ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు. శనివారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జేఈఈ వంటి జాతీయ పరీక్షలకు అమలు చేస్తున్న మాదిరిగానే ఒక్క నిమిషం నిబంధనను ఈఏపీసెట్‌కు కూడా అమలు చేస్తున్నామన్నారు.

అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకు రావాలని సూచించారు. బాల్‌పాయింట్‌ పెన్నులు, రఫ్‌ వర్క్‌ చేసుకోవడానికి అవసరమైన కాగితాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారన్నారు. పరీక్షల సమయాల్లో విద్యార్థులకు అనువుగా ఉండేలా బస్సులు నడపాలని ఇప్పటికే ఆర్టీసీ అధికారులను కోరామన్నారు. 

3 లక్షలకు పైగా అభ్యర్థుల దరఖాస్తు
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్‌కు 3,00,084 మంది దరఖాస్తు చేశారని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు తెలిపారు. ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కులకు వెయిటేజీ ఉండదని, సెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటిస్తామని చెప్పారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రామ్మోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ ప్రేమ్‌కుమార్, సెట్స్‌ ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. 

రోజుకు రెండు చొప్పున 10 సెషన్లలో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌
► ఈఏపీసెట్‌లో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు రోజుకు రెండు చొప్పున 10 సెషన్లలో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతాయి. 
► 11, 12 తేదీల్లో 4 సెషన్లలో బైపీసీ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతాయి.
► అభ్యర్థులు తమ హాల్‌ టికెట్‌లోని పేరు, పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్‌ వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తప్పు ఉంటే ఈఏపీసెట్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రానికి తెలియజేసి సరిచేయించుకోవాలి.
► హాల్‌ టికెట్‌ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు
► ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు వీలుగా మ్యాప్‌ల ద్వారా మార్గాన్ని చూపించే సదుపాయం కల్పించారు.
► విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 
► చెక్‌ఇన్‌ ప్రొసీజర్‌లో భాగంగా బయోమెట్రిక్‌ ఇన్ఫర్మేషన్‌ కేప్చర్‌ చేస్తారు. ఎడమ వేలి ముద్ర ద్వారా వీటిని నమోదు చేయనున్నందున అభ్యర్థులు మెహిందీ వంటివి పెట్టుకోకూడదు.
► బాల్‌పెన్నుతో అప్లికేషన్‌ ఫారాన్ని నింపి దానికి ఫొటోను అతికించి ఇన్విజిలేటర్‌ సమక్షంలో సంతకం చేసి అందించాలి. అలా అప్లికేషన్‌ను సమర్పించని వారి ఫలితాలను ప్రకటించరు.
► పరీక్ష సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడి వెంటనే పరిష్కారం కాకపోతే ఎంత సమయం ఆలస్యమైందో ఆమేరకు అదనపు సమయాన్ని ఇస్తారు. 
► హాల్‌ టికెట్లను కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి.
► ఇతర వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్‌://సీఈటీఎస్‌.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.జీఓవీ.ఐఎన్‌/ఈఏపీ సీఈటీ’ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు
► సందేహాలుంటే ‘ఏపీఈఏపీసీఈటీ2022హెచ్‌ఈఎల్‌పీడీఈఎస్‌కెఃజీమెయిల్‌.కామ్‌కు తెలియజేయవచ్చు. లేదా 08554–234311 లేదా 08554–232248 నంబర్లలో సంప్రదించవచ్చు.   

మరిన్ని వార్తలు