Sakshi News home page

AP: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ సస్పెన్షన్‌

Published Wed, Jul 26 2023 8:50 AM

AP Employees Association Leader Suryanarayana Suspended - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స­స్పెం­డ్‌ అయ్యారు. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సస్పె­న్షన్‌ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

అయితే, 2019 నుంచి 2021 మధ్య గుంటూ­రు జిల్లా కుంచనపల్లిలోని వాణిజ్య పన్ను­ల శాఖ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయంలో సూప­రింటెండెంట్‌గా పనిచేసిన కేఆర్‌ సూర్యనారాయణతోపాటు ఆయన సహ ఉద్యోగులు మెహర్‌కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని తెలిపారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఆయన పలువురు వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై విజయవాడ సిటీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం, ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది.

హైకోర్టులో సూర్యనారాయణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తం ఆరి్థక నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై క్రిమినల్‌ కేసు ఎదుర్కొంటున్న కేఆర్‌ సూర్యనారాయణ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసి­న వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపా­రు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఆగ­స్టు 1కి వాయిదా వేశారు. 

కొందరు వ్యాపారులతో కుమ్మక్కై వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినందుకు సూర్యనారాయణతో పాటు మరికొందరు ఉద్యోగులపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సూర్యనారాయణ పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విజయవాడ కోర్టు గత వారం కొట్టేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు.  

ఇది కూడా చదవండి: గిరిజనుల అభ్యున్నతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం 

Advertisement

తప్పక చదవండి

Advertisement