గ్రామ స్థాయిలోనే తాగునీటి నాణ్యత పరీక్షలు | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో నీటి పరీక్షలు చేసేందుకు 66,500 మందికి శిక్షణ

Published Wed, Dec 16 2020 7:56 PM

AP Government Conducts Drinking Water Quality Testing In Every Village - Sakshi

సాక్షి, అమరావతి: తాగునీటి వల్ల డయేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు గ్రామాల్లో ప్రబలకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రతి గ్రామంలో తాగునీటి పరీక్షలు నిర్వహించనుంది. ప్రమాదకర సూక్ష్మక్రిములు ఆ నీటిలో ఉన్నాయో, లేదో ఎవరైనా తమ సొంత ఊరిలోనే పరీక్షలు చేసి తెలుసుకోవచ్చు. ఈ మేరకు అన్ని గ్రామాలకు నీటి పరీక్షల కిట్లను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పరీక్షలు చేయడంపై ప్రతి ఊరిలో ఐదుగురి చొప్పున శిక్షణ కూడా ఇవ్వనుంది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో తాగునీటి నాణ్యతను నిర్ధారించేందుకు అన్ని గ్రామాలకు 5 లక్షల హెచ్‌2ఎస్‌ వైల్స్‌ పరీక్ష కిట్లు.. 13,300 ఫీల్డ్‌ టెస్ట్‌ కిట్లను సరఫరా చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఫీల్డ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్, న్రైటేట్, కాల్షియం వంటివి మనం తాగే నీటిలో కలుషితమై ఉన్నాయో, లేదో గుర్తించవచ్చు. ఒక్కొక్క కిట్‌తో వంద దాకా పరీక్షలు నిర్వహించవచ్చు. గ్రామానికి ఒకటి చొప్పున ఈ కిట్‌ను అన్ని గ్రామాలకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

హెచ్‌2ఎస్‌ వైల్స్‌ పరీక్ష కిట్ల ద్వారా మనం తాగే నీటిలో సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) వంటివి ఏమైనా ఉన్నాయో, లేదో తెలుసుకోవచ్చు. ఒక్కో కిట్‌ ద్వారా ఒక విడత మాత్రమే పరీక్ష నిర్వహించే వీలుంటుంది. ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ తాగునీటి వనరుల్లో ఒక్కో దానికి రెండేసి హెచ్‌2ఎస్‌ వైల్స్‌ కిట్లను ప్రభుత్వం సరఫరా చేయనుంది. గ్రామీణ తాగునీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారుల గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో తాగునీటి కోసం ఉపయోగించే మంచినీటి పథకాలు, బోర్లు, బావులు తదితరాలన్నీ కలిపి మొత్తం 2,50,000 దాకా ఉన్నాయి. వీటన్నింటికీ రెండేసి కిట్ల చొప్పన రాష్ట్రమంతటా ఐదు లక్షల కిట్లను సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం ఈ కిట్ల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. ఈ కిట్ల ద్వారా గ్రామ స్థాయిలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించాక నీరు కలుషితమైనట్టు గుర్తిస్తే పూర్తి స్థాయి పరీక్షల కోసం సబ్‌ డివిజన్‌, జిల్లా స్థాయిలో ఉండే ల్యాబ్‌కు నీటి నమూనాలను పంపుతారు. 

ప్రతి గ్రామంలో ఐదుగురికి శిక్షణ
గ్రామ స్థాయిలోనే సులువుగా తాగునీటి నాణ్యత పరీక్షలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఐదుగురికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. 
⇔ ప్రతి గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్త, గ్రామ సర్పంచ్‌ లేదా కార్యదర్శి, స్కూల్‌ టీచర్‌, ఒక ఎన్జీవో ప్రతినిధికి శిక్షణ ఇస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 66,500 మందికి శిక్షణ అందిస్తారు. 

⇔ ఈ నెల 9 నుంచి మండల స్థాయిలో శిక్షణ నిర్వహించేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. 

⇔ తాగునీరు ఎలా కలుషితమయ్యే అవకాశం ఉంది? అలాంటి నీరు తాగడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి గంటన్నర నిడివితో ఒక వీడియోను.. రెండు రకాల కిట్లను ఉపయోగించి తాగునీటికి ఎలా పరీక్షలు చేయాలనే దానిపై మరో 45 నిమిషాల వీడియోను రూపొందించారు. శిక్షణ కార్యక్రమాల్లో ప్రదర్శించేందుకు ఈ వీడియోల సీడీలను మండలాలకు పంపారు. 

⇔ అలాగే తాగునీరు కలుషితం కావడానికి కారణాలు, ఈ నీటిని తాగడం వల్ల సంభవించే సీజనల్‌, దీర్ఘకాలిక వ్యాధులపై గ్రామీణ ‍ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద సంఖ్యలో వాల్‌ పెయింట్‌లు వేయించడంతోపాటు కరపత్రాల ద్వారా ప్రచారం చేయనున్నారు.

⇔ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆ‍ధ్వర్యంలో తాగునీటి పరీక్షలు చేపట్టేందుకు సబ్‌ డివిజనల్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న 125 ల్యాబ్‌లను ఆధునికీకరించనున్నారు. వీటితోపాటు గ్రామ స్థాయిలో పరీక్షల నిర్వహణకు కిట్ల కొనుగోలు, శిక్షణ, ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణకు మొత్తం రూ.48 కోట్లను ఖర్చు చేయనున్నారు. 

వ్యాధులను ముందే అరికట్టే వీలు
రెండు రకాలుగా తాగునీరు కలుషితమవ్వడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతుంటారని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కోలిఫామ్, ఈ–కోలి అనే రెండు సూక్ష్మక్రిములు తాగునీటిలో కలుషితమై ఉండి ఉంటే.. ఆ నీటిని తాగేవారు డయేరియా బారిన పడే ప్రమాదం ఉంటుంది. తద్వారా చిన్న పిల్లలు కొద్ది సమయంలోనే పూర్తిగా నీరసపడి మరణించవచ్చు. ఈ స్థితికి కారణమయ్యే ఆ రెండు సూక్ష్మక్రిములు తాగునీటిలో ఉన్నాయో, లేదో హెచ్‌2ఎస్‌ వైల్స్‌ పరీక్ష కిట్ల ద్వారా తెలుసుకోవచ్చు. రెండో రకంలో.. ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్, న్రైటేట్, కాల్షియం వంటివాటితో తాగునీరు కలుషితమైతే కీళ్ల నొప్పులు, పళ్లు దెబ్బతినడంతోపాటు దీర్ఘకాలిక అనార్యోగ సమస్యలు తలెత్తుతాయని అధికారులు తెలిపారు. ఈ రసాయన కలుషితాలను ఫీల్డ్‌ టెస్ట్‌ కిట్ల ద్వారా తెలుసుకుంటారు. గ్రామ స్థాయిలోనే ఈ తాగునీటి పరీక్షల నిర్వహణకు నిర్ణయించడం వల్ల ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా అరికట్టవచ్చన్నారు. అలాగే దీర్ఘకాలిక అనార్యోగ సమస్యలను కూడా చాలా వరకు రాకుండా చూడొచ్చని తెలిపారు.
 
రక్షిత మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
తాగునీటి ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా మారుమూల కుగ్రామాలతో సహా ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. జలజీవన్‌ మిషన్‌ కింద గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం గ్రామాల్లో పెద్దఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాగే నీరు కలుషితమైందో, లేదో తెలుసుకోవడానికి గ్రామాల్లో సైతం నీటి పరీక్షలు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులను పూర్తిగా అరికట్టాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం.
–పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

కలుషిత నీటికి ఆస్కారం లేకుండా..
ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కలుషిత నీటికి ఆస్కారం లేకుండా, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తాగునీటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో ఐదుగురికి శిక్షణ అందించనున్నాం. ఈ నెల 9 నుంచి మండలాల స్థాయిలో శిక్షణ ప్రారంభం కానుంది. తద్వారా గ్రామ స్థాయిల్లోనే ఎక్కడికక్కడ తాగునీటి పరీక్షలు చేసుకోవచ్చు. - గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ

కరపత్రాల ద్వారా ప్రచారం..
కలుషిత నీటి కారణంగా కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలకు కరపత్రాలు, వాల్‌ పెయింటింగ్‌ల ద్వారా విస్తృత అవగాహన కలిగిస్తాం. గ్రామ స్థాయిలోనే తాగునీటి పరీక్షలకు కిట్ల పంపిణీతోపాటు సబ్‌ డివిజన్‌ స్థాయిలో ఉండే నీటి పరీక్షల ల్యాబ్‌లను సైతం జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఆధునికీకరించేందుకు ప్రభుత్వం నిధులు అందజేసింది. ఇటీవలే రాష్ట్రంలో ఐదు ల్యాబ్‌లకు నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లేబొరేటరీస్‌ (ఎన్‌ఏబీల్‌) గుర్తింపు కూడా దక్కింది. మిగిలిన 120 ల్యాబ్‌లకు కూడా ఈ గుర్తింపు దక్కేలా చర్యలు తీసుకుంటున్నాం. – కృష్ణారెడ్డి, ఈఎన్‌సీ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం. 

Advertisement
Advertisement