Sakshi News home page

తగ్గుముఖం పట్టిన వానలు.. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం      

Published Mon, Dec 12 2022 3:30 AM

AP Government Focusing On Relief Measures For Rain Affected Areas - Sakshi

సాక్షి, అమరావతి: కుండపోత, భారీ వర్షాల నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తేరుకుంటున్నాయి. మూడు రోజు­లుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్ష ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టడంతో భారీ నష్టాన్ని నివారించింది. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. అధికారులతో పాటు నాలుగు ఎస్డీఆర్‌ఎఫ్, ఐదు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా సేవలందిస్తున్నాయి. వర్షాల వల్ల శిబిరాల్లో తల దాచుకున్న ఆరు జిల్లాలకు చెందిన వారికి తక్షణ సాయంగా రూ.1000, గరిష్టంగా కుటుంబానికి రూ.2 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మంచి భోజన, వసతి ఏర్పాటు చేశారు. కాగా, శనివారం కూడా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కొనసాగాయి.  
 
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అధిక ప్రభావం 
తుపాను కారణంగా తిరుపతి జిల్లాలో 21 మండలాలు, చిత్తూరు జిల్లాలో 14 మండలాలు, ప్రకాశంలో 10, నెల్లూరులో 9, అన్నమయ్యలో 8 మండలాలు ప్రభావితమయ్యాయి. తిరుపతి జిల్లాలో 571 మందిని, చిత్తూరు జిల్లాలో 416, నెల్లూరు జిల్లాలో 208 మందిని.. మొత్తంగా 1,195 మందిని శిబిరాలకు తరలించారు. వర్షాలకు వైఎస్సార్‌ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లాలో 55 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు.  

గత 24 గంటల్లో వర్షపాతం ఇలా.. 
శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లిలో అత్యధికంగా 15.4 సె.మీ వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టెపాడులో 15.1 సెం.మీ, ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లిలో 14.4 సెం.మీ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం టి.ముస్తాపురంలో 12.37 సెం.మీ, చీపినపిలో 12.35 సెం.మీ, ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కోతపల్లిలో 11.9 సె.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నెల్లూరు జిల్లా ఉలవపాడులో 8.6 సెం.మీ, కందుకూరులో 7.6 సెం.మీ, మన్నేటికోటలో 7.4 సెం.మీ, కందుకూరు దైవివారిపాలెంలో 7.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
సహాయక చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష 
– తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వరద బాధితులకు చేపడుతున్న సహాయక చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్‌లతో సమీక్షించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మెరుగైన భోజన, వసతి సౌకర్యాలు కలి్పంచారు.  
– ఈ రెండు జిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలో వివిధ పంటలు నీట మునిగినట్లు అంచనా. శనివారం వేకువజామున భారీగా వీచిన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. శిబిరాల నుంచి ఇళ్లకు వెళుతున్న కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.2 వేలు అందజేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం వర్షపు నీటిలోనే పర్యటించి, మున్సిపల్‌ అధికారులను అప్రమత్తం చేశారు.  ఎక్కడా నీరు నిలవకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి దుప్పట్లు పంపిణీ చేశారు.  
 
లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు 
– మాండూస్‌ తుపాన్‌ తీరం దాటినప్పటికీ ఆ ప్రభావంతో ఇంకా నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేల వాలడంతో ఆ శాఖకు నష్టం వాటిల్లింది. 
– నెల్లూరు నగరంతో పాటు లోతట్టు ప్రాంతాల కాలనీల్లో ఇంకా వర్షపు నీరు నిలబడిపోయింది. నెల్లూరు ఆర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, వైఎస్సార్‌ నగర్, చౌటమిట్ట కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న నీటిని అధికారులు జేసీబీల సాయంతో కాలువల్లోకి మళ్లిస్తున్నారు. నగర పంచాయతీ అయిన బుచి్చరెడ్డిపాళెంలో చెన్నకేశవ ఆలయం గర్భగుడిలోకి వర్షం నీరు చేరింది. వ్యవసాయ, విద్యుత్‌ శాఖాధికారులు నష్టం అంచనాకు ఉపక్రమించారు.   
 
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు 
– ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు నీట మునిగాయి. దర్శి, కనిగిరి, కొండపి ప్రాంతాల్లో కొంత మేర పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అనేక ప్రాంతాల్లో వాగులు రోడ్లెక్కి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు నిండటంతో జలకళ సంతరించుకుంది. 
– ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వరి కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వర్షాల ప్రభావం డెల్టా రైతులపై తీవ్రంగా ఉంది. భట్టిప్రోలులో వరి ఓదెలు నీట మునిగాయి. దెబ్బతిన్న పంటలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలిస్తున్నారు.   
– తుపాను తీరం దాటి బలహీన పడినప్పటికీ కాకినాడ తీరంపై ఇంకా దాని ప్రభావం కనిపిస్తోంది. కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేటల్లో తీరానికి చేరువగా ఉన్న ఇళ్లు కోతకు గురవుతున్నాయి. ఉప్పాడ వద్ద తీర రక్షణకు వేసిన జియోట్యూబ్‌ గోడ ధ్వంసమైంది.    
– ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ, పెడన, మైలవరం తదితర నియోజకవర్గాల్లో 7,500 ఎకరాల్లో పనలపై ఉన్న వరిపంట, కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నీటమునిగాయి. కంకిపాడు, గన్నవరం, ఉయ్యూరు, పామర్రు, పెనమలూరు పరిసరాల్లో ధాన్యం రాశులు వర్షానికి స్వల్పంగా తడిచాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement