ప్రైవేట్‌ వైద్య విద్యార్థులకు ఊరట.. | Sakshi
Sakshi News home page

తగ్గిన ఎంబీబీఎస్‌ ఫీజులు

Published Fri, Nov 6 2020 8:34 AM

AP Government Has Decided To Reduce MBBS Fees - Sakshi

సాక్షి, అమరావతి: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద వైద్యవిద్య అభ్యసించే ఎంబీబీఎస్, బీడీఎస్‌ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఇందుకు సంబంధించిన ఫీజులు తగ్గిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా కోర్సుల ఫీజులను ఖరారు చేసింది. ప్రైవేటు, మైనార్టీ కాలేజీలకు ఇవి వర్తిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకూ ఎంబీబీఎస్‌కు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తుండగా, ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. తాజాగా నిర్ణయించిన ఫీజులు 2020–21 నుంచి 2022–23 వరకూ అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. కాగా, మొత్తం 17 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, 14 డెంటల్‌ కాలేజీలకు ఈ ఫీజులను నిర్ణయించారు. ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు. ఏ ప్రైవేటు కళాశాల అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సింఘాల్‌ ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. అంతేకాక.. మెడికల్, డెంటల్‌ అభ్యర్థులకు విధిగా స్టైఫండ్‌ చెల్లించాలన్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..)

సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఫీజు రూ.15 లక్షలు
రాష్ట్రంలో ఐదు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు కూడా ఉన్నాయి. అవి జీఎస్‌ఎల్, కాటూరి, నారాయణ, ఎన్‌ఆర్‌ఐ, పిన్నమనేని సిద్ధార్థ కాలేజీలు. వీటిల్లో ట్యూషన్‌ ఫీజు రూ.15 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు కూడా మూడేళ్ల పాటు  అమల్లో ఉంటాయని సింఘాల్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌
ఫీజుల నిర్ణయం జరిగింది. ఇక అడ్మిషన్లకు రెండు మూడ్రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తాం. అడ్మిషన్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లూ చేశాం. అత్యంత పారదర్శకంగా అడ్మిషన్లు జరుగుతాయి.
– డా.శ్యాంప్రసాద్, వైస్‌ చాన్స్‌లర్, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ 

Advertisement
Advertisement