ఉద్యాన సిరులు | Sakshi
Sakshi News home page

ఉద్యాన సిరులు

Published Mon, Aug 1 2022 4:41 PM

AP Govt Encouragement Lemon Mango And Papaya Crops - Sakshi

ఈమె పేరు పాదర్తి కృష్ణమ్మ. పొదలకూరు మజరా లింగంపల్లి. కృష్ణమ్మ ఈ ఏడాది 1.20 ఎకరాల్లో కూరగాయాల సాగు చేపట్టింది. ఉద్యానశాఖ ద్వారా ఆమెకు రూ.19,200 సబ్సిడీ బ్యాంకు ద్వారా ప్రభుత్వం అందజేసింది. కూరగాయాల సాగులో మెళకువలను తెలుసుకుని దిగుబడి సాధించారు.   

యర్రనాగు దొరసానమ్మ. మండలంలోని మొగళ్లూరు. ఆమె తన ఎకరా     పొలంలో నిమ్మ మొక్కలు నాటారు. ఆమెకు ఉద్యానశాఖ ద్వారా ఈ ఏడాది రూ.9,602 రాయితీ లభించింది. ఉద్యానాధికారుల సలహాలు సూచనలతో చీడపీడలు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అందజేస్తున్న రాయితీ వస్తుందని, దీనిపై ఆధారపడి నిమ్మ మొక్కలు నాటుకున్నట్టు వెల్లడించారు.   

ఈ రైతు పేరు అక్కెం అంకిరెడ్డి. మండలంలోని ముదిగేడు. తనకున్న 1.20 ఎకరాల్లో నిమ్మమొక్కలు నాటుకుని జీవిస్తున్నారు. ఉద్యానశాఖ రాయితీ సహకారంతో తోటలో మల్చింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఈ ఏడాది రూ.19,200 బ్యాంకులో సబ్సిడీ నగదు జమఅయ్యింది. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా కల్పిస్తున్న రాయితీలు రైతుకు ఉపయోగకరంగా ఉన్నాయి.    

పొదలకూరు:  పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా రాయితీలను అందజేస్తోంది. ప్రధానంగా 70 శాతం మంది రైతులు వరి సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే పంట మార్పిడి పద్ధతిని రైతులకు అలవాటు చేసే దశగా ప్రభుత్వం ఉద్యాన పంటలను గణనీయంగా పెంచేందుకు కృషి చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అదనంగా మరో 20 వేల హెక్టార్లలో సాగు పెంచేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది. నిమ్మ, మామిడి విస్తీర్ణం పెరుగుతున్నా మిగిలిన పండ్ల తోటల సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ప్రభుత్వ ప్రకటిస్తున్న రాయితీలతో పండ్లు, కూరగాయలు, పూల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 


 
మూడు విడతల్లో రాయితీ  
పండ్ల తోటల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని మూడు విడతలుగా పంపిణీ చేస్తోంది. పండ్ల తోటల సాగు ద్వారా అధిక దిగుబడులను సాధించేందుకు నూతనంగా తోటల అభివృద్ధి పరిచేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పండ్ల తోటలతో పాటు మల్లె, చామంతి, కనకాంబరం, బంతి, లిల్లీ పూల తోటల పెంపకానికి కూడా రాయితీలను అందజేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టే మొత్తం ఖర్చులో 40 శాతం రాయితీని హెక్టారుకు రూ.16 వేలు, ఇతర రైతులకు 25 శాతం హెక్టారకు రూ.10 వేలు అందజేస్తున్నారు. పూలపెంపకం మల్చింగ్‌కు రూ.16 వేలు, ప్రాసెసింగ్‌ యూనిట్‌కు రూ.10 లక్షలు, ప్యాక్‌హౌస్‌ రూ.2 లక్షలు, కోల్డ్‌స్టోరేజ్‌కు రూ.5.25 లక్షలు, సంకరజాతి కూరగాయాల పెంపకానికి హెక్టారుకు ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తున్నారు.  
 
యాంత్రీకరణకు రాయితీలు 
ఉద్యాన యాంత్రీకరణకు రాయితీలు అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు 50 శాతం, ఇతరులు 40 శాతం రాయితీ పొందవచ్చు. మినీ ట్రాక్టర్‌కు రూ.75 వేలు, పవర్‌ టిల్లర్‌ రూ.40 వేలు, తైవాన్‌ స్ప్రేయర్‌ రూ.8 వేలు రాయతీ కల్పిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో ఉద్యాన పంటలను రక్షించుకునేందుకు తోటల్లో నీటి కుంటల నిర్మాణానికి ఉద్యానశాఖ ద్వారా కమ్యూనిటీ నీటి కుంట రూ.20 లక్షలు, పంట కుంట రూ.75 వేలు అందజేస్తున్నారు.  

పంటల సాగుకు ప్రోత్సాహం 
ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలను అందజేస్తోంది. ప్రధానంగా పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. రైతుల అనుమానాలను క్షేత్రస్థాయికు వెళ్లి నివృత్తి చేస్తున్నాం. ఉద్యానశాఖ నిబంధనల ప్రకారం రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం.  
– ఈ.ఆనంద్, ఉద్యానాధికారి, పొదలకూరు

Advertisement
Advertisement