టమాటా రైతుకు రానున్నది మంచికాలం | Sakshi
Sakshi News home page

టమాటా రైతుకు రానున్నది మంచికాలం

Published Tue, Nov 22 2022 5:10 AM

AP Govt Focus On Tomato Farmers Minimum Support Price - Sakshi

సాక్షి, అమరావతి: దళారుల ప్రమేయం లేకుండా టమాటా రైతులకు కనీస మద్దతు ధర కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఇంటిగ్రేటెడ్‌ టమాటా వాల్యూచైన్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్స్‌ డేల్‌ ఆగ్రో ప్రాసెసింగ్‌ ఇండియా (పై) లిమిటెడ్‌ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. సొసైటీ ద్వారా రూ.110 కోట్ల అంచనాతో 20 ప్రాథమిక ప్రాసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
మంత్రి కాకాణి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ, ఏపీ మహిళాభివృద్ధి సొసైటీ, లారెన్స్‌ డేల్‌ ఆగ్రో ప్రాసెసింగ్‌ ఇండియా ప్రతినిధులు 

వచ్చేనెలలో 4 ప్రాసెసింగ్‌ కేంద్రాలు ప్రారంభం
నాలుగు ప్రాసెసింగ్‌ కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కాకాణి చెప్పారు. వీటి నిర్వహణ బాధ్యతలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్‌పీవోలకు) అప్పగిస్తామని తెలిపారు. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్‌ తదితర పనులకు ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, మార్కెటింగ్‌ చైన్‌ అభివృద్ధికి లారెన్స్‌ డేల్‌ ఆగ్రో ప్రాసెసింగ్‌ ఇండియా (పై) లిమిటెడ్‌ సహకరిస్తాయని తెలిపారు.

సాధారణంగా డిమాండు, సప్లయ్‌కి  అనుగుణంగా ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల కొన్నిసార్లు టమాటా రైతులు, మరికొన్నిసార్లు బహిరంగ మార్కెట్‌లో రేట్లు పెరగడం వలన వినియోగదారులు నష్టపోతున్నారని చెప్పారు. ధర పతనమైనప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం... మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడు రైతుల నుంచి కొనుగోలుచేసి రైతుబజార్ల ద్వారా సరసమైన ధరలకు విక్రయిస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తుందన్నారు.

ఇటీవల కొన్ని జిల్లాల్లో డిమాండుకు మించి దిగుబడుల ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర రాలేదన్నారు.  ఈ ప్రాజెక్టు ద్వారా 20 ఎఫ్‌పీవోల పరిధిలోని 20 వేలమంది టమాటా రైతులకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈవో ఎల్‌.శ్రీధర్‌రెడ్డి, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ సీఈవో సీఎస్‌ రెడ్డి, లారెన్స్‌ డేల్‌ ఆగ్రో ప్రాసెసింగ్‌ ఇండియా (పై) లిమిటెడ్‌ సీఈవో పి.విజయరాఘవన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement