AP Govt Given WhatsApp Number For Identify Train Accident Victims - Sakshi
Sakshi News home page

AP: మీ వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్‌ చేయండి.. నెంబర్‌ ఇదే..

Published Sun, Jun 4 2023 11:24 AM

AP Govt Given WhatsApp Number For Identify Train Accident Victims - Sakshi

సాక్షి, అమరావతి: ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీవాసుల వివరాలు, భద్రత కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. 

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో క్షత్రగాత్రుల సమాచారం కోసం  విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చింది. మిస్సయిన వారి సమాచారం కోసం ఈ 1070, 112, 18004250101 ఫోన్‌ చేయాలని సూచించింది. అలాగే, 8333905022 నెంబర్‌కు ప్రయాణికుడి ఫొటో, ఇతర వివరాలను వాట్సాప్‌లో పంపించాలని తెలిపింది. అనంతరం, వివరాల ఆధారంగా పోలీసు శాఖతో సమన్వం చేసుకుని బాధితులకు వివరాలు తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు. 

మరోవైపు, రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పద్దుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించిన అనంతరం మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం బాలాసోర్ లో నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణిస్తున్నారు. అలాగే, ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 342 మందిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. గుర్తించిన వారిలో 14 మంది క్షతగాత్రులని, వీరిలో 10 మంది రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లో, నలుగురు క్షతగాత్రులు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్నారని చెప్పారు. ఇదే బోగీలో ప్రయాణిస్తున్న గురుమూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం మరణించారని అమర్నాథ్ వెల్లడించారు.

కాగా, ఇంకా గుర్తించవలసిన వారి వివరాల కోసం అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదని, ఇప్పటికీ తమ వారి ఆచూకీ కోసం  8333905022 నంబర్‌ వాట్సాప్‌కు ఆచూకీ లభ్యం కాని వారి ఫోటోలు పంపిస్తే అధికారులు వారి వివరాలు సేకరిస్తారని మంత్రి అమర్నాథ్ చెప్పారు.

ఇలా ఉండగా రాష్ట్రానికి చెందిన 16 అంబులెన్స్‌లను, 10 మహాప్రస్థానం వాహనాలను భువనేశ్వర్ లో అందుబాటులో ఉంచామని, మరో ఐదు అంబులెన్సులను బాలాసోర్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ తరలించామని, ఇద్దరిని విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు, ఒకరిని విశాఖ ఆరిలోవలోని అపోలోకు తరలించినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా..  

Advertisement
Advertisement