గ్రామాల్లో సగం కుటుంబాలకు.. ఉపాధి

8 Nov, 2020 04:04 IST|Sakshi

పథకం కింద నమోదైన యాక్టివ్‌ కూలీల్లో దాదాపు అన్ని కుటుంబాలకు పనికల్పన

ఇప్పటికే కూలీలకు వేతనంగా రూ.4,858 కోట్లు చెల్లింపు

అనంతపురం జిల్లా చినకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో 1,166 కుటుంబాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు 79,739 పనిదినాల ద్వారా రూ.1,85,69,000 వేతనాలుగా పొందాయి. అంటే.. సగటున ప్రతి కుటుంబం ఏడు నెలల కాలంలో రూ.15,925 చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందింది.

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద దోర్నాలలో 1,858 కుటుంబాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు 82,422 రోజుల పనిదినాల ద్వారా రూ.1,84,33,000 వేతనాలుగా పొందాయి. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దాదాపు సగం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో 96 లక్షల కుటుంబాలు ఉన్నాయని అంచనా. ఇందులో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు 46,39,981 కుటుంబాలకు పథకం కింద ప్రభుత్వం పనులు కల్పించినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు కూలీలు రూ.4,913 కోట్ల మేర పనులు చేయగా..రూ.4,858 కోట్లు మేర చెల్లింపులు కూడా పూర్తయ్యాయని తెలిపారు.

2006లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 14 ఏళ్ల కాలంలో.. ఒక ఆర్థిక ఏడాది సమయంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఇంత ఎక్కువ సంఖ్యలో కుటుంబాలకు పథకం కింద పనులు కల్పించిన దాఖలాలు లేవని.. ఇదో రికార్డని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రమంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గ్రామాల్లో వ్యవసాయ పనులు పెద్దగా లేకపోయినప్పటికీ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించలేకపోయారు. 2016–17 ఆర్థిక ఏడాదిలో 39.91 లక్షల కుటుంబాలు మాత్రమే పనులు పొందగా.. 2017–18లో 39.94 లక్షల కుటుంబాలే పనులు పొందాయి.

యాక్టివ్‌ కూలీ కుటుంబాలు.. 54.89 లక్షలు
ఉపాధి హామీ పథకంలో పనుల కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,43,508 కుటుంబాలు నమోదు చేసుకొని జాబ్‌కార్డులు పొందినప్పటికీ.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరాల ప్రకారం యాక్టివ్‌ కూలీ కుటుంబాలు 54.89 లక్షలుగా ఉన్నాయి. గత మూడేళ్ల కాలంలో కనీసం ఒక్క రోజు అయినా పనులు కావాలని కోరి, చేసిన వారినే యాక్టివ్‌ జాబ్‌కార్డు కుటుంబాలుగా ఆ శాఖ గుర్తిస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో యాక్టివ్‌ జాబ్‌కార్డు కుటుంబాలుగా గుర్తింపు పొందిన వాటిలో దాదాపు 90 శాతం ఈ ఆర్థిక ఏడాది పనులు పొందాయి. 3,33,989 కుటుంబాలు పూర్తి స్థాయిలో వంద రోజుల పనులు పూర్తిచేశాయి. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 60,01,097 కుటుంబాలు పనులు పొందాయి. కరోనా, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో గ్రామాల్లో చాలా కుటుంబాలు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు