AP Govt Issued Circular Extending Working Journalists Health Scheme - Sakshi
Sakshi News home page

AP: వర్కింగ్ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌

Published Wed, Apr 19 2023 8:05 PM

AP Govt Issued Circular Extending Health Scheme For Working Journalists - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో యం.యస్ నెం.48ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే 31.03.2023న జీవో నంబర్ 38 జారీ చేసిన విషయం గుర్తుచేశారు. ఈ క్రమంలో కొత్తగా అక్రిడిటేషన్ కార్డును పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం క్రింద ప్రీమియం రూ.1,250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన డబ్బులు చెల్లించి 31.03.2024 వరకు లబ్ధి పొందాలని కమిషనర్ సూచించారు. 

ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేయించుకున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డు జిరాక్స్‌ కాపీలను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని రెండవ ఫ్లోర్‌లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ, కమిషనర్ కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులు అయితే సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సిందిగా కమిషనర్ తెలిపారు.

వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం ప్రీమియం రూ.2,500 కాగా ఇందులో జర్నలిస్టు వాటా రూ.1,250, ప్రభుత్వం వాటా రూ.1,250 అన్నారు. భార్య/భర్త, పిల్లలు, జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వం కార్పస్ ఫండ్‌ను నిర్వహిస్తూ జర్నలిస్టులు చేసిన వైద్య ఖర్చులను రీయింబర్స్ చేస్తుందని తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సదరు రీయింబర్స్ మెంట్ క్లెయిమ్స్ ను పథకం విధివిధానాలను అనుసరించి సెటిల్ చేస్తుందన్నారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ.2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు.

వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) తరహాలో వైద్య సేవలు పొందవచ్చన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని, అదే విధంగా నిర్ధేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ పథకానికి వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా అదే విధంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కోరారు.

ఆరోగ్యశ్రీ లో భాగంగా 2023-24 సంవత్సరానికిగాను వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీంను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాస రావు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో గతంలో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా వర్కింగ్ జర్నలిస్టులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవసరమైన వైద్య సేవలు పొందే వీలు కలుగుతుందన్నారు. ఈ పథకం అమలులో వర్కింగ్ జర్నలిస్టుల క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ హామీ మేరకు 104 హెల్ప్‌లైన్‌లో ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు కూడా వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగించుకోవాలని కొమ్మినేని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement