High Court Refuses to stay on Chintamani Drama Ban in Anadhra Pradesh - Sakshi
Sakshi News home page

చింతామణి నాటకం నిషేధంపై స్టేకు నిరాకరించిన ఏపీ హైకోర్టు

Published Fri, Jun 24 2022 3:11 PM

AP High Court Refuses to stay on Chintamani Drama Ban in Ap - Sakshi

సాక్షి, అమరావతి : భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తామంటే ఊరుకోబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించేందుకు నిరాకరించింది. నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ద్వారా అసభ్య డైలాగులు చెప్పిస్తూ ఆర్యవైశ్యులను కించపరిచేలా చూపుతున్నందున, దానిని నిషేధించాలన్న ఆర్యవైశ్య సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నాటకం ప్రదర్శనపై నిషేధం విధించింది. దీనిని సవాలు చేస్తూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, కళాకారుడు త్రినాథ్‌ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌లు) దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం ముందు శుక్రవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పీవీజీ ఉమేశ్‌ చంద్ర, ఆర్‌.వెంకటేశ్‌లు వాదనలు వినిపిస్తూ.. కళాకారుల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులున్నాయని అన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏ ఒక్క వర్గం మనోభావాలను కూడా కించపరచడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

చింతామణి నాటకంలో ఏముందో తెలుసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంది. నాటకంలో ఏముందో పరిశీలిస్తామని చెప్పింది. నాటకానికి సంబంధించిన ఒరిజినల్‌ పుస్తకం, దాన్ని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసిన కాపీని తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది.    

చదవండి: (ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం) 

Advertisement
Advertisement