ఏపీ: రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్ | Sakshi
Sakshi News home page

ఏపీ పంచాయతీ ఎన్నికలు రెండో దశ: లైవ్ ‌అప్‌డేట్స్‌

Published Sat, Feb 13 2021 6:25 AM

AP Panchayat Elections 2021, Phase 2, LIVE Updates, Results, Winning Candidates - Sakshi

సాక్షి, అమరావతి : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో  రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళం 72.87, విజయనగరం 82, విశాఖ 84.94,తూ.గో. 82.86, ప.గో.81.75, కృష్ణా 84.14, గుంటూరు 85.51, ప్రకాశం 86.93, నెల్లూరు 78.04, చిత్తూరు 77.20, వైఎస్ఆర్ జిల్లా 80.47, కర్నూలు 80.76, అనంతపురం 84.65 శాతం పోలింగ్‌ నమోదైంది.

మధ్యాహ్నం: 4.00
 ప్రారంభమైన రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌
అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. 2,786 పంచాయతీలు, 20,817 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటికే 539 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.

మధ్యాహ్నం: 3.30
ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా  రెండవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్‌ జరిగింది. క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం దక్కనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ పక్రియ మొదలవ్వనుంది.‌

మధ్యాహ్నం: 2.48
పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌
వైఎస్సార్‌ జిల్లా: కమలాపురం నియోజకవర్గంలో వల్లూరు పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ హరి కిరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యూ లైన్‌లో ఓటర్ల వద్ద ఓటర్ స్లిప్‌లను పరిశీలించారు. కౌంటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన కేంద్రాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను జిల్లా అడిషనల్ ఎస్పీ ఖాసీం సాహెబ్  పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

మధ్యాహ్నం: 1.59
కృష్ణా జిల్లా: గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా రెండో విడత పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ ఇంతియాజ్‌ పరిశీలిస్తున్నారు. ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తున్నారు. ఉదయం.. గుడ్లవల్లేరు, ముదినేపల్లి, గుడివాడ మండలాల్లో కలెక్టర్‌ విస్తృతంగా ప్యటించారు.

మధ్యాహ్నం 1.12
క్రమేపీ పెరుగుతున్న పోలింగ్‌ శాతం..
పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ శాతం క్రమేసీ పెరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్‌ నమోదయిందన్నారు. 9 వేల పోలింగ్‌ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో  స్వల్ప సమస్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు.

మధ్యాహ్నం 12.58
మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్‌..
రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్‌ నమోదైంది.
జిల్లాల వారిగా ఓటింగ్ శాతం
శ్రీకాకుళం జిల్లా- 51.30 శాతం
విజయనగరం జిల్లా- 71.5 శాతం
విశాఖ జిల్లా- 64.28 శాతం
తూర్పుగోదావరి- 60.90 శాతం
పశ్చిమగోదావరి- 63.54 శాతం
కృష్ణా జిల్లా- 66.64 శాతం
గుంటూరు జిల్లా- 69.08 శాతం
ప్రకాశం జిల్లా- 65.15 శాతం
నెల్లూరు జిల్లా- 59.92 శాతం
చిత్తూరు జిల్లా-67.20 శాతం
వైఎస్సార్‌ జిల్లా- 64.28 శాతం
కర్నూలు జిల్లా- 69.61 శాతం
అనంతపురం జిల్లా- 70.32 శాతం

మధ్యాహ్నం 12.40
పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ..
అనంతపురం: బెలుగుప్ప మండలం కాలువపల్లి పోలింగ్ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. చేసిన ఓటు హక్కు సద్వినియొగం చేసుకోవాలని ఓటర్లను సుచించారు. ఎలాంటి సమస్యలను తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు...

మధ్యాహ్నం 12.21
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి
శ్రీకాకుళం:
పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన స్వగ్రామం దేవనల్తాడలో మంత్రి అప్పలరాజు దంపతులు ఓటు వేశారు.

మధ్యాహ్నం 12.05
ఓటర్లకు పోలీసు సేవలు
వైఎస్సార్‌ జిల్లా: ఓటు వేసేందుకు వచ్చిన వికలాంగులు, వృద్ధులకు మానవతా దృక్పథంతో పోలీసులు సాయం అందిస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె ఎస్‌ఐ చిన్నపెద్దయ్య మానవత్వం చాటుకున్నారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని అప్పకొండయ్యగారిపల్లె పోలింగ్ బూత్ వద్ద నడవలేని వృద్ధురాలిని ఓటు వేయడానికి మోసుకుని తీసుకెళ్లారు. 

ఉదయం 11.39
‘తూర్పు’లో ప్రశాంతంగా పోలింగ్‌..
తూర్పు గోదావరి:
జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. రామచంద్రాపురం, మండపేట మండలాల్లో పోలింగ్‌  కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్‌ అరుణ్‌కుమార్‌ పరిశీలించారు. ప్రారంభంలో మందకొడిగా ఉన్నా, పదిన్నర గంటలకు 35 శాతం వరకు పోలింగ్ నమోదైంది. తొలి విడత కన్నా.. అధిక శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంది.

ఉదయం 11.28
ఇరు వర్గాల బాహాబాహీ..
నెల్లూరు జిల్లా: ఎస్‌పేట మండలం చిరుమన పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. అప్రమత్తమయిన పోలీసులు రంగంలోకి దిగారు. గొడవలు పడుతున్నవారిపై లాఠీఛార్జ్‌ జరిపారు.

ఉదయం 11.12
ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్..
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్ నమోదైంది. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను  రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్‌ పర్యవేక్షిస్తున్న్నారు.
శ్రీకాకుళం-26.81 శాతం
విజయనగరం-48.08 శాతం
విశాఖ జిల్లా-40.94 శాతం
తూర్పుగోదావరి- 34.51 శాతం
పశ్చిమగోదావరి- 31.6 శాతం
కృష్ణా జిల్లా- 35.81 శాతం
గుంటూరు జిల్లా- 45 శాతం
ప్రకాశం జిల్లా- 34.14 శాతం
నెల్లూరు జిల్లా- 36.3 శాతం
చిత్తూరు జిల్లా- 33.50 శాతం
కర్నూలు జిల్లా- 46.96 శాతం
అనంతపురం జిల్లా- 41.29 శాతం
వైఎస్సార్‌ జిల్లా- 35.17 శాతం

ఉదయం 11.01
నిలిచిన పోలింగ్‌..
ప్రకాశం జిల్లా: సంతమాగులూరు మండలం ఏల్చూరులో 14వ వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. ఓటర్ల జాబితాలో  తప్పుల పై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు.

ఉదయం 10.57
పార్వతీపురం మండలంలో టీడీపీ దౌర్జన్యం..
విజయనగరం: పార్వతీపురం మండలంలో టీడీపీ దౌర్జన్యాలకు దిగింది. కృష్ణపల్లి కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

ఉదయం 10.30
ఇరువర్గాల మధ్య ఘర్షణ
ప్రకాశం జిల్లా: పొదిలి మండలం  దాసల్లపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అప్రమత్తమయిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఉదయం 10.24
పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ..
వైఎస్సార్‌ జిల్లా: చెన్నూరు మండలంలోని ఉప్పర పల్లి  గ్రామంలో పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు

ఉదయం 10.00
విజయనగరం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ‌కంట్రోల్ రూమ్‌ నుంచి పోలింగ్‌ను కలెక్టర్‌ హరి జవహర్‌లాల్ పరిశీలిస్తున్నారు.

ఉదయం 9.30
కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత దౌర్జన్యం
కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డారు. వృద్ధురాలితో బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేయగా, టీడీపీ నేతను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అడ్డకున్నారు. ఇర్గువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. పోలీసులు చెదరగొట్టారు.

ఉదయం. 9. 00
తొలి రెండు గంటల్లో పోలింగ్ 10.28 శాతం
ఏపీ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో పోలింగ్ 10.28 శాతం నమోదైంది. క్యూలైన్లలో ఓటర్లు ఓటు వేయడానికి వేచి ఉన్నారు. 9 వేలకుపైగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్  ఏర్పాటు చేశారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను  రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్‌ పర్యవేక్షిస్తున్న్నారు.

చిత్తూరు జిల్లాలోని కొర్లకుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి పేరం మేనక భర్త ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి మద్దిరాల భాను ప్రకాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి గాలివీడు పోలీస్ స్టేషన్‌కి తరలించారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఉదయం. 8.30
వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ మద్దతుదారులు దాడి
పామర్రు పెరిసేపల్లి పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీసీ మద్దతు ఏజెంట్‌పై టీడీపీ మద్దతుదారులు దాడికి తెగపడ్డారు. సదరు ఏజెంట్‌ మాస్క్‌ పెట్టుకోలేదనే నెపంతో దాడి చేశారు. టీడీపీ మద్దతుదారులపై ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ మద్దతుదారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఏస్పీ ఆదేశించారు. 

ఉదయం. 8.00
పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతగా సాగుతోంది. ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్‌లో నిల్చుంటున్నారు. పోలీంగ్‌ సరళి పరిశీలనకు 2,606 మందిని అధికారులు నియమించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షణ చేస్తున్నారు.

ఉదయం. 7.30
పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీని నియమించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో ఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్స్‌ను అధికారులు నియమించారు.


ఉదయం. 7.05
పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఉదయం.6.30
ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ శనివారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్‌ జరుగుతుంది. 

ఉదయం. 6.25
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు రెండో విడత పోలింగ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో దశలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దీంతో 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్‌ జరగనుంది.

7,507 మంది పోటీ
సర్పంచి స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్‌ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement