పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల్లో ఏపీ నం.1 | Sakshi
Sakshi News home page

పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల్లో ఏపీ నం.1

Published Thu, Aug 31 2023 5:12 AM

AP is the state with the highest PSP capacity in the country - Sakshi

సాక్షి,అమరావతి: విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, వినూత్న సాంకేతికతలతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. భవిష్యత్‌లో రాష్ట్రానికి విద్యుత్‌ కొరత రాకుండా చేసేందుకు పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు (పీఎస్‌పీ)ల ఏర్పాటుకు శ్రీకారం చుట్డి అమలు చేయడమే కాకుండా దేశంలోనే పీఎస్పీ సామర్థ్యంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీ తరువాతి స్థానాల్లో రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలున్నట్టు తెలిపింది.  

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం 
దేశం మొత్తం మీద 2030–31 నాటికి 18.8 గిగావాట్ల సామర్థ్యం  ఉన్న పీఎస్‌పీల అవసరం ఉందని కేంద్ర ఇంధన శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో వేరియ­బుల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ (వీఆర్‌ఈ)ని బ్యాలెన్స్‌ చేయడానికి, పీక్‌ అవర్‌ డిమాండ్‌ను చేరుకోవడానికి ప్రభుత్వం పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఏపీ పంప్డ్‌ స్టోరేజ్‌ ఎనర్జీ పాలసీ 2022ని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, ప్రోత్సాహంతో ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీలో పీఎస్‌పీల ఏర్పాటు జరుగుతోంది.

ఇప్పటికే 32,400 మెగావాట్ల సామ­ర్ధ్యం కలిగిన పీఎస్‌పీల ఏర్పాటుకు 29 సైట్‌ల కోసం టెక్నో కమర్షియల్‌ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ (టీసీఎఫ్‌ఆర్‌)లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తం 37 స్థానాల్లో 42,370 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్‌పీల నిర్మాణానికి స్థలాలను గుర్తించింది. మొత్తం 16,180 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్‌పీలు వివిధ డెవలపర్లకు కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్‌పీ నిర్మాణానికి కేంద్ర విద్యుత్‌ మండలి (సీఈఏ) అనుమతి కూడా ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్‌ కో గ్రూప్‌ 1,680 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మిస్తోంది.

ఒకే చోట మూడు రకాల (జల, పవన, సౌర) విద్యుత్‌ ఉత్పత్తి చేసి, నిల్వ చేసే ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. తాజాగా రాష్ట్రంలో 1,950 వేల మెగావాట్ల సామర్ధ్యం గల రెండు పీఎస్‌పీల స్థాపనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీతో ఏపీ జెన్‌కో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల సమాన భాగస్వామ్యంతో 2,750 మెగావాట్ల సామర్థ్యం గల మరో మూడు ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.

పీఎస్పీ అంటే ఇదీ.. 
పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ అనేది ఒక రకమైన జల విద్యుత్‌ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. ఈ ప్లాంట్లు సంప్రదాయ జల విద్యుత్‌ ప్లాంట్లలానే పనిచేస్తాయి. వీటికి అదనంగా అదే నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్‌ సౌర ఫలకల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్‌ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని  విడుదల చేయడం వల్ల టర్బైన్‌ కిందకి కదిలి విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఒక సారి నిర్మించిన ప్రాజెక్టు ఎనభై ఏళ్ల వరకూ పనిచేస్తుంది. 1890 కాలంలో ఇటలీ, స్విట్జర్లాండ్‌లో మొదలైన పీఎస్పీ సాంకేతికత 1930లో యునైటెడ్‌ స్టేట్స్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడిది ప్రపంచమంతా విస్తరించింది. తాజాగా మన దేశంలో పీఎస్పీల స్థాపనలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా అవతరించింది.

Advertisement
Advertisement