నీటి లెక్కలు తేల్చకుండా వాడుకోవద్దని ఎలా అంటారు?

2 Apr, 2023 04:12 IST|Sakshi

కృష్ణా బోర్డుపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారుల అసహనం

రాష్ట్ర కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయి

కోటాకంటే అదనంగా 73.56 టీఎంసీలు వాడుకున్న తెలంగాణ

ఎడమ కాలువ కింద రాష్ట్ర కోటాలో 13 టీఎంసీలు రావాలి

వాటిని విడుదల చేయని తెలంగాణ

తెలంగాణపై చర్యలు తీసుకోవడంలో బోర్డు విఫలం

కోటా నీటిని తాగు నీటి అవసరాలకు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ

రేపు అధికారికంగా బోర్డుకు లేఖ

సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి సాగర్‌ కుడి కాలువ ద్వారా నీటిని వాడుకోవద్దంటూ కృష్ణా బోర్డు ఆదేశించడంపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోటా నీటిని తాగు నీటి అవసరాల కోసం వాడుకుంటున్నామని, దాన్ని ఆపేయాలని ఆదేశించడ­మేమిటని మండిపడుతున్నారు.

సాగర్‌ ఎడమ కాలువలో రాష్ట్ర కోటా కింద మిగిలిన 13 టీఎంసీలను విడుదల చేసేలా తెలంగాణ అధికారులను ఎందుకు ఆదేశించలేదని బోర్డును నిలదీస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలు తేల్చాకే ఇతర అంశాలపై చర్చిద్దామని స్పష్టం చేస్తున్నారు. లెక్కలు తేల్చకుండా నీటిని వాడుకోవద్దని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాస్తామని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

సాగర్‌ కుడి కాలువ ద్వారా రోజూ 9 వేల క్యూసెక్కులను ఏపీ వాడుకుంటోందంటూ తెలంగాణ ఈఎన్‌సీ రాసిన లేఖకు స్పందించిన కృష్ణా బోర్డు.. ఆ నీటి వాడుకాన్ని ఆపేయాలని శుక్రవారం ఏపీ ఈఎన్‌సీకి లేఖ రాసింది. బోర్డు ఆదేశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు మండిపడుతున్నారు.

ప్రస్తుత నీటి సంవత్సరంలో వరద రోజుల్లో వాడుకున్నదిపోనూ మిగతా రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కోటా కంటే 73.56 టీఎంసీలు ఎక్కువ వినియోగించుకుందని, ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని అధికారులు తెలిపారు. నీటి లెక్కలు తేల్చి.. మా కోటా నీటిని రబీలో సాగు, వేసవిలో తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలని మార్చి 13న కృష్ణా బోర్డుకు లేఖ రాశామని ఏపీ ఈఎన్‌సీ గుర్తు చేస్తున్నారు.

కోటా కంటే అధికంగా వాడుకున్న తెలంగాణను కట్టడి చేసి, సాగర్‌ ఎడమ కాలువ కోటా కింద ఏపీకి ఇంకా రావాల్సిన 13 టీఎంసీలను విడుదల చేసేలా ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం లేఖ రాస్తామని అధికారులు చెప్పారు.

నీటి లెక్కలు తేల్చేందుకు తక్షణమే సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరతామన్నారు. కోటా మేరకే తాగు అవసరాలకు సాగర్‌ కుడి కాలువ నుంచి నీటిని వాడుకుంటున్నామని, ఆపే ప్రశ్నే లేదని స్పష్టం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు