AP: సంక్రాంతి కానుక.. స్పెషల్‌ బస్సుల్లో సాధారణ ఛార్జీలే.. | Sakshi
Sakshi News home page

AP: సంక్రాంతి కానుక.. స్పెషల్‌ బస్సుల్లో సాధారణ ఛార్జీలే..

Published Sat, Jan 6 2024 4:36 AM

APSRTC to run 6795 special buses on key routes during Sankranti - Sakshi

అదనపు చార్జీల భారం లేకుండా సాధారణ చార్జీలతోనే సంక్రాంతి పండుగ ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది.  ఈ నెల 6 నుంచి 18 వరకు మొత్తం 6,795 ప్రత్యేక బస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో ఏడాది సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం.

రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటిల్లో రిజర్వేషన్ల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుచేసింది.  
– సాక్షి, అమరావతి

ప్రత్యేక బస్సుల వివరాలు..
► ఈ నెల 6 నుంచి 14 వరకు 3,570 సర్వీసులు నిర్వహిస్తారు. తిరుగు ప్రయాణం నిమిత్తం ఈనెల 16 నుంచి 18 వరకు 3,225 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటుచేస్తున్నారు.

► సంక్రాంతికి ముందుగా నిర్వహించే ప్రత్యేక సర్వీసుల విషయానికొస్తే.. హైదరాబాద్‌ నుంచి 1,600, బెంగళూరు నుంచి 250,   చెన్నై నుంచి 40 సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటుచేశారు.

► అలాగే, రాష్ట్రంలో విజయవాడ నుంచి 300, విశాఖపట్నం నుంచి 290, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 70, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 790 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు.

► సంక్రాంతి తరువాత ఈ నెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌ నుంచి 1,500, బెంగళూరు నుంచి 495, చెన్నై నుంచి 85 సర్వీసులను రాష్ట్రంలోని ప్రాంతాలకు ఏర్పాటుచేశారు.

► విజయవాడ నుంచి 200, విశాఖపట్నం నుంచి 395,  రాజమహేంద్రవరం నుంచి 50, తిరుపతి నుంచి 50, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 700 సర్వీసులు నిర్వహిస్తారు.

► చార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్‌ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కానుక ఇదీ..
నిజానికి.. సంక్రాంతి, దసరా పండుగల ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అధిక చార్జీలు వసూలు చేయడం రాష్ట్రంలో దశాబ్దా­లపాటు అమలవుతూ వచ్చింది. ఒకటిన్నర రెట్లు చార్జీలు అంటే సాధారణ చార్జీలపై 50శాతం అధికంగా చార్జీలు వసూలు చేసే­వారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు­లు సాధారణ చార్జీల కంటే రెండు­మూడు రెట్లు అధికంగా వసూలు చేసేవి. ఫలితంగా ప్ర­యా­ణికులు భారీ ఆర్థిక భారాన్ని వహించా­ల్సి వచ్చేది.

ఈ విధానానికి వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. సాధారణ చార్జీలతోనే పండుగ ప్రత్యేక సర్వీసులను కూడా నిర్వహించాలని నిర్ణ­యించింది. 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2020, జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి 2021 నుంచి పండుగ ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నిర్వహిస్తోంది. వరసగా నాలు­గో ఏడాదీ ప్రత్యేక బస్సు­లను సాధారణ చార్జీలతోనే నిర్వహించాలని నిర్ణయించింది. 

రిజర్వేషన్లలో 10శాతం రాయితీ..
ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కూడా ఆర్టీసీ కల్పించింది. ఒకేసారి రానూపోనూ రిజర్వేషన్‌ చేసుకుంటే 10శాతం రాయితీ ఇస్తోంది. దీంతో సాధారణ చార్జీల కంటే తక్కువతోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసేందుకు సూపర్‌వైజర్లను నియమించింది. బస్సులకు జీపీఎస్‌ ట్రాకింగ్, 24 గంటలు సేవలు అందించే సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. కాల్‌ సెంటర్‌ నంబర్లు 149, 0866–2570005.

సద్వినియోగం చేసుకోండి
ప్రయాణికులపై భారం పడకూడదనే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది నిర్ణయించింది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయా­ణికులకు మెరుగైన ప్రయాణ సే­వలు అందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లూచేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సేవలను ప్రయా­ణికులు సద్వినియోగం చేసుకోవాలి.  – ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ 

Advertisement
Advertisement