Sakshi News home page

రొయ్యల కోసం ఆక్వారోబో

Published Sun, May 14 2023 4:34 AM

Aqua robot for shrimp farming Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: అత్యాధునిక సాంకేతిక పరిజా­్ఞనాన్ని అందిపుచ్చుకున్న ఓ ఆక్వా రైతు రొయ్యల పెంపకంలో రోబోను వినియోగిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పశ్చిమ గోదా­వరి జిల్లా భీమవరం సమీపంలోని చినఅమిరం గ్రామానికి చెందిన వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు మద్రాస్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశారు. కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన ఆయన ఆ కొలువును వదిలి రొయ్యల సాగు చేపట్టారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల గ్రామంలో దాదాపు 700 ఎకరాల్లో రొయ్యలను పెంచుతున్నారు. వాటికి ఆహారం అందించేందుకు ఆక్వా రోబో (బాట్‌)ను తయారు చేయించుకుని వినియోగి­స్తున్నా­రు. ఇది సౌర విద్యుత్‌ తానే తయారు చేసుకుని పని చేస్తుంది. విద్యుత్‌ ఆదా కోసం అనేక సాంకేతిక విధానాలను, పరికరాలను వాడుతున్నారు. ఈ మొత్తం వ్యవస్థను ఒక ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా అరచేతిలోనే నడిపిస్తున్నారు. ఆక్వా రంగంలో భారతదేశంలోనే తొలి రోబో ఇదే కావడం విశేషం.

కూలీల అవసరం లేకుండానే..: చెరువులోని రొయ్యలకు మనుషులే ఆహారం (ఫీడింగ్‌) అందించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అది అనేక ఇబ్బందులతో కూడుకోవడంతో పాటు ఆహారం సకాలంలో అందేది కాదు. దీంతో మార్కెట్‌లో ఆటోమేటిక్‌ ఫీడర్ల కోసం వెతికారు. కానీ.. అవి కూడా ఒకేచోట ఫీడింగ్‌ చేసేవి. దానివల్ల రొయ్యలన్నిటికీ ఆహారం సమానంగా అందేది కాదు. దీంతో చెరువు మొత్తం తిరిగేలా యంత్రాన్ని తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు లక్ష్మీకుమార్‌రాజు. నెక్ట్‌ ఆక్వా సంస్థతో తన ఆలోచనను పంచుకున్నారు.

ఆ సంస్థ ఐఐటీ గ్రాడ్యుయేట్లతో ఏర్పాటైంది. వారికి ఈ ఆలోచన నచ్చి నాలుగేళ్ల పాటు అరిపిరాలలోనే ఉండి పరిశోధన చేశారు. రకరకాల ప్రయత్నాల తరువాత చివరకు మూవింగ్‌ రోబోను తయారు చేశారు. చెరువులో తాడుతో (గైడెడ్‌) లైన్‌లా కట్టి దాని సాయంతో రెండేళ్లుగా ఈ రోబోను నడుపుతున్నారు. దీని ఆపరేటింగ్‌ మొత్తం మొబైల్‌తోనే జరుగుతుంది. ఎన్ని కేజీల ఆహారం.. ఏ సమయంలో.. ఎన్నిసార్లు అందించాలనేది ముందుగానే ప్రోగ్రా>మింగ్‌ చేసుకోవచ్చు. దాని ప్రకారం కచ్చితంగా అంతే ఆహారాన్ని ఆయా సమయాల్లో ఈ రోబో రొయ్యలకు అందిస్తుంది. ముఖ్యంగా ఈ రోబోకి అవసరమైన విద్యుత్‌ను దానిపైనే అమర్చిన సౌర పలకల ద్వారా తానే తయారు చేసుకుంటుంది.

క్షణక్షణం.. అప్రమత్తం
కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (సీటీ) లేదా పవర్‌ మోనిటర్‌ (బ్లాక్‌ బాక్స్‌)అనే పరికరంతో విద్యుత్‌ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆటోమేటిక్‌ పవర్‌ ఫ్యాక్టర్‌ కంట్రోలర్‌గా పనిచేస్తూ విద్యుత్‌ నష్టాలను, విద్యుత్‌ బిల్లులను తగ్గిస్తుంది. ఎన్ని ఏరియేటర్స్‌ (రొయ్యలకు ఆక్సిజన్‌ అందించే పరికరాలు) పని చేస్తున్నాయనేది నిరంతరం చూస్తుంటుంది. ఏరియేటర్స్‌ ఆగితే వెంటనే చెబుతుంది. మూడు మొబైల్‌ నంబర్లకు ఫోన్‌ అలర్ట్‌ వెళ్లిపోతుంది. నిజానికి ప్రతి పరిశ్రమలో ఆటోమేటిక్‌ పవర్‌ ఫ్యాక్టర్‌ కంట్రోలర్స్‌ వాడుతుంటారు. వీటిని ఆక్వాలో వాడటం అనేది చాలా అరుదు. మోటార్లు ఆగిపోతే వెంటనే సరిచేసి ఆన్‌ చేయాలి. లేదంటే రొయ్యలు చనిపోతాయి. ఇందుకోసం రైతులు రాత్రివేళల్లో చెరువుల వద్ద కాపలాగా పడుకోవాల్సి వస్తోంది.

అలాంటి సమయంలో విద్యుత్‌ ప్రమాదాల బారినపడి రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరుగుతున్నాయి. ఈ సమస్యలను పవర్‌ మోనిటర్‌ తీరుస్తోంది. ఎన్ని ఏరియేటర్స్‌ ఆన్‌ చేస్తే అన్నే కెపాసిటర్లు ఆన్‌ అయ్యేలా చూస్తుంది. అవి ఆగిపోతే కెపాసిటర్లను ఆపేస్తుంది. జనరేటర్‌ పనితీరును కూడా ఇది పర్యవేక్షిస్తుంది. దీనివల్ల డీజిల్‌ దొంగతనాన్ని అరికట్టవచ్చు. స్మార్ట్‌ స్టార్టర్‌ కంట్రోలర్‌ అనే పరికరం ద్వారా మొబైల్‌తోనే ఏరియేటర్స్‌ని ఆన్‌ చేయవచ్చు. అవి ఎంతసేపు పనిచేయాలనేది ప్రోగ్రామింగ్‌ చేసుకోవచ్చు. సాంకేతిక సమస్య ఏదైనా ఏర్పడితే మొబైల్‌కి సమాచారం వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మోటారు కాలిపోకుండా కాపాడుతుంది. 

విద్యుత్‌ బిల్లులు ఆదా
విద్యుత్‌ వ్యవస్థకు సాంకేతికతను జోడించి మా చెరువుల్లో వినియోగిస్తున్నాం. పర్యావరణ హితం కోరి 15 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను వాడుతున్నాం. పవర్‌ మాంక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా చెరువుల మొత్తం ఎంత విద్యుత్‌ వినియోగం జరుగుతోంది, సరఫరా ఎలా ఉంది, ఎక్కడైనా సాంకేతిక, భౌతిక ఇబ్బందులు ఉన్నాయా అనేది రియల్‌ టైమ్‌ (ఎప్పటికప్పుడు) సమాచారాన్ని టీవీ (మోనిటర్‌)లో కనిపించేలా సెన్సార్లు ఏర్పాటు చేశాం. దీనివల్ల 95 శాతం కంటే ఎక్కువగా విద్యుత్‌ వినియోగం సక్రమంగా జరుగుతోంది. ప్రతి 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌పై నెలకు కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ విద్యుత్‌ ఆదా అవుతోంది.
– వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు, ఆక్వా రైతు

Advertisement
Advertisement