Sakshi News home page

మళ్లీ అరకు ఇన్‌స్టెంట్‌ కాఫీ రెడీ 

Published Wed, Dec 21 2022 6:21 AM

Araku instant coffee is ready again Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ కాఫీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న అరకు కాఫీ నుంచి ఇన్‌స్టెంట్‌ సాచెట్స్‌ మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్ల విరామం అనంతరం ఇన్‌స్టెంట్‌ కాఫీ సాచెట్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సర్వం సిద్ధంచేసింది. ఇప్పటికే 40 టన్నుల కాఫీ పండ్లు సేకరించి ప్రాసెసింగ్‌కు అప్పగించింది.

సంక్రాంతి పండుగకు ఘుమఘుమలాడే అరకు ఇన్‌స్టెంట్‌ కాఫీ తాగేలా మార్కెట్‌లోకి తీసుకురానుంది. అరకు ఇన్‌స్టెంట్‌ కాఫీని 2018లో మార్కెట్‌లోకి తీసుకొచ్చిన జీసీసీ లాభాలబాటలో పయనించింది. మార్కెట్‌లోకి వచ్చిన కొద్ది నెలల్లో బ్రాండ్‌గా దూసుకెళ్లిన అరకు కాఫీకి మంచి డిమాండ్‌ ఏర్పడింది. అయితే ఇన్‌స్టెంట్‌ కాఫీ ప్రక్రియ చేపట్టే బెంగళూరుకు చెందిన వాహన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు డబ్బులు చెల్లించకపోవడం, అధికారులతో విభేదాలు, కోవిడ్‌ కారణంగా 2019 మొదట్లోనే సరఫరాకు బ్రేక్‌ పడింది.

అప్పటి నుంచి ఇన్‌స్టెంట్‌ కాఫీ ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగా జీసీసీ ఎండీగా సురేష్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సదరు సంస్థతో పలుమార్లు చర్చలు జరిపారు. వారికి ఇవ్వాల్సిన బకా­యిలు చెల్లించడంతో తిరిగి ఇన్‌స్టెంట్‌ ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు.  

తొలివిడతగా 40 టన్నుల సేకరణ  
రెండు రోజుల్లో ఇన్‌స్టెంట్‌ కాఫీ ప్రక్రియ ప్రారంభించేందుకు జీసీసీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే గిరిజనుల నుంచి పదిశాతం కన్నా తక్కువ తేమ ఉన్న నాణ్యమైన 40 టన్నుల కాఫీ పండ్లను సేకరించింది. దీనివల్ల మంచి రుచితోపాటు సువాసన కూడా కాఫీకి తోడవుతుంది. ఈ పండ్లని రోస్టింగ్, ఇతర ప్రక్రియల­తో ఇన్‌స్టెంట్‌ కాఫీ పౌడర్‌గా మార్చనున్నా­రు. 2 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లతోపా­టు 50, 100 గ్రాముల టిన్స్‌ కూడా మార్కెట్‌లోకి తీసుకురావాలని జీసీసీ ఏర్పాట్లు చేసింది. రూ.3, రూ.12 చొప్పున సాచెట్స్‌ అమ్మకపు ధరలుగా నిర్ణయించింది. తొలివిడతగా గిరిజనుల నుంచి సేకరించిన 40 టన్నులతో ఇన్‌స్టెంట్‌ కాఫీ పొడిని మార్కెట్‌లోకి తీసుకురానుంది.

ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తాం 
ఎప్పటికప్పుడు నాణ్యమైన ఇన్‌స్టెంట్‌ కాఫీని వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యాం. రెండు రోజుల్లో ప్రాసెసింగ్‌ ప్రారంభమవుతుంది. జనవరి 10 తర్వాత మార్కెట్‌లోకి విడుదల చేస్తాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త ఇన్‌స్టెంట్‌ కాఫీ సాచెట్స్‌ వచ్చేలా తయారీ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించాం. మిగిలిన కంపెనీ బ్రాండ్‌ల సాచెట్స్‌లో చూపించే పరిమాణం కంటే తక్కువ కాఫీ పొడి ఉంటుంది. కానీ, అరకు ఇన్‌స్టెంట్‌ కాఫీ సాచెట్స్‌ మాత్రం ఎంత పరిమాణం చెప్పామో.. అంతే ఉండేలా కచ్చితత్వంతో అందిస్తాం. గిరిజనులకు లాభాలను అందించేలా జీసీసీ ప్రతి నిర్ణయం తీసుకుంటోంది. 
 జి.సురేష్‌కుమార్, జీసీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌  

Advertisement

తప్పక చదవండి

Advertisement