Sakshi News home page

అందరికీ అందుబాటులోకి శాసనాలు

Published Fri, Apr 1 2022 5:11 AM

Archaeological Department in form of a book preserving inscriptions - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లభ్యమైన పురాతన శాసనాలను పరిరక్షించడంతోపాటు వాటిలోని సమాచారాన్ని గ్రంథస్తం చేసేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ చర్యలు చేపడుతోంది. జిల్లాలవారీగా లభ్యమైన శాసనాలను రాజవంశాల పాలనా క్రమం ఆధారంగా ముద్రించనుంది. వాటిని ఆంగ్లంతోపాటు తెలుగులోకి అనువాదం చేసి సామాన్యులకు సైతం అందుబాటులోకి తేనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం వైఎస్సార్‌ జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో ఒకదాన్ని మాత్రమే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. అయితే చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాలతోపాటు డిజిటల్‌ రూపంలో శాసనాలను భద్రపరచనుంది. 

వివిధ భాషల్లో శాసనాలు.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పురావస్తు శాఖలో 8,613 శిలా శాసనాలు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం 5,375 శాసనాలు ఏపీకి దక్కాయి. వీటిల్లో బ్రాహ్మీ, తెలుగు–కన్నడం, కన్నడం, తెలుగు, తమిళం, ఒడియా లిపితోపాటు ప్రాకృతం, సంస్కృతం, కన్నడం, తెలుగు, తమిళం, ఒడియా భాషల్లో శాసనాలున్నాయి. ఇందులో కర్నూలు జిల్లా ఎర్రగుడిలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో గండశిలలపై బ్రాహ్మీ లిపిలో ప్రాకృతంలో చెక్కిన మౌర్య చక్రవర్తి అశోకుడి శాసనాన్ని పురాతనమైనదిగా చరిత్రకారులు చెబుతారు. ఇక వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లలో క్రీస్తు శకం 575లో చోళరాజు పాలనలో వేసిన కలమల్ల శాసనాన్ని తొలి తెలుగు శాసనంగా గుర్తించారు. ఈ శిలా శాసనాలు అరుగుదలకు గురయ్యే ప్రమాదం ఉండటంతో వీటిలోని సమాచారాన్ని యథాతథంగా ప్రత్యేక పేపర్లపై నకళ్లుగా తీసి భద్రపరిచారు. వీటిని కూడా త్వరలో డిజిటల్‌ రూపంలోకి మార్చనున్నారు. 


తెలంగాణలోనే ఏపీ రాగి శాసనాలు..
తమ వంశాల చరిత్ర, సామాజిక, మత, పరిపాలన విధానాలు, నిర్దిష్ట కాలం, ప్రాంతం, ఆర్థిక, రాజకీయ చరిత్రకు సంబంధించి రాజులు.. రాతి ఫలకాలు, రాతి స్తంభాలు, పురాతన దేవాలయాల గోడలు, మండపాల నేలపై శాసనాలు వేయించేవారు. వీటితోపాటు రాగి ఫలకాలపైనా శాసనాలు ముద్రించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో 250 సెట్లు (ఒక్కో సెట్‌కు 4–5 రాగి ఫలకాలు) రాగి శాసనాల్లో అత్యధికం ఏపీకి చెందినవే. అయితే వీటి విభజన ఇంకా పూర్తికాకపోవడంతో విలువైన చారిత్రక సంపద తెలంగాణలోనే ఉండిపోయింది.

భావితరాలకు అందిస్తాం..
శాసనాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రాష్ట్రంలో లభించిన శాసనాల్లోని సమాచారాన్ని పుస్తక రూపంలోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 
– జి.వాణీమోహన్, కమిషనర్, రాష్ట్ర పురావస్తు శాఖ   

Advertisement

తప్పక చదవండి

Advertisement