ఐటీ.. పోటాపోటీ.. మూడున్నరేళ్లలో ఏకంగా 194 కంపెనీల రాక  | Sakshi
Sakshi News home page

నాలుగున్నరేళ్లలో గణనీయంగా పెరిగిన ఐటీ కంపెనీలు

Published Thu, Dec 15 2022 4:38 AM

Arrival of 194 IT companies in three and half years to Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాభ్యాసం అనంతరం మన విద్యార్థులు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడకుండా స్థానికంగానే ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం వేగంగా సాకారమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖతో పాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. రాష్ట్రంలో 2019కి ముందు ఐటీ కంపెనీల సంఖ్య 178 కాగా, ఇప్పుడవి 372కి చేరుకున్నాయి. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏకంగా 194 ఐటీ కంపెనీలు ఏర్పాటు కావడం గమనార్హం. 

శరవేగంగా కార్యకలాపాలు.. 
రెండేళ్లుగా కోవిడ్‌తో గట్టి సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఐటీ కంపెనీలు... ఇప్పుడు రాష్ట్రంలో కార్యకలాపాలను వేగంగా ప్రారంభిస్తున్నాయి. గత ఆర్నెల్ల వ్యవధిలో ఇన్ఫోసిస్, రాండ్‌ శాడ్, టెక్నోటాస్క్, ఐజెన్‌ అమెరికా సాఫ్ట్‌వేర్, టెక్‌బుల్, కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌ లాంటి డజనకుపైగా కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటైనట్లు ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ (అపిటా) గ్రూప్‌ సీఈవో ఎస్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీలు, విస్తరణ ద్వారా అదనంగా 20,000కిపైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వివరించారు. మరికొన్ని కీలక ఐటీ కంపెనీలతో చర్చలు తుది దశలో ఉన్నట్లు వెల్లడించారు. 

విశాఖ, విజయవాడలో జోరుగా.. 
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుండటంతో పలు ఐటీ కంపెనీలు భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటివరకు విశాఖకే పరిమితమైన టెక్‌ మహీంద్రా తాజాగా విజయవాడలో కార్యకలాపాలను ప్రారంభించింది. గన్నవరం మేథా టవర్స్‌లో 120 సీటింగ్‌ సామర్థ్యంతో కార్యాలయాన్ని టెక్‌ మహీంద్రా ప్రారంభించింది. హెచ్‌సీఎల్‌ విజయవాడ నుంచి విశాఖకు విస్తరించగా, విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్‌ఎస్, పల్ససెస్‌ ఐడీఏ లాంటి 30కిపైగా ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలు విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి.

2012లో కేవలం 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. ఇందులో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు డబ్ల్యూఎన్‌ఎస్‌ సీఈవో కేశవ్‌ ఆర్‌ మురుగేష్‌ వెల్లడించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థ ఉద్యోగుల సంఖ్య 4,200 దాటినట్లు పల్సస్‌ సీఈవో  సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీలు, విస్తరణ ద్వారా గత మూడున్నరేళ్లలో రాష్ట్రంలో 23,000 మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించింది. 2019లో నాటికి రాష్ట్రంలో 35,000 మంది ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 58,000కి చేరినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 

ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ కాన్సెప్ట్‌ సిటీల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. అదానీ గ్రూపునకు చెందిన వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌  రూ.14,634 కోట్లతో నెలకొల్పే డేటా సెంటర్‌కు అన్ని కీలక అనుమతులు మంజూరు కావడంతో త్వరలోనే పనులను మొదలు కానున్నాయి. మరో రెండు కీలక సంస్థలు కూడా డేటా సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలు విజయవాడ, విశాఖల్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు వచ్చాయి. పలు ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో రహేజా లాంటి సంస్థలు ఐటీ పార్కుల నిర్మాణానికి ముందుకొస్తున్నాయి. రహేజా గ్రూపు విశాఖలో 17 ఎకరాల్లో ఇన్‌ ఆర్బిట్‌మాల్‌తో పాటు ఐటీపార్కు ఏర్పాటు చేయనుంది.  

Advertisement
Advertisement