Cyclone Asani In AP: అతి తీవ్రంగా 'అసని'

9 May, 2022 04:47 IST|Sakshi

దిశ మార్చుకుంటున్న తుపాన్‌ 

ఉత్తరాంధ్ర, ఒడిశాకు తప్పిన ముప్పు 

సముద్రంలోనే బలహీనపడే అవకాశం 

ఉత్తరాంధ్రకు వర్ష సూచన 

రాష్ట్రంలో పలుచోట్ల గాలులు, భారీవర్షాలు

వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఆదివారం నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనంతపురం, కడప ప్రాంతాల్లోను వర్షాలు పడుతున్నాయి.

భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెంలో భారీ వర్షానికి రోడ్లు నీళ్లతో నిండి ట్రాఫిక్‌ స్తంభించింది. కృష్ణా జిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో భారీవర్షాలు, ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు, ఎక్కువచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది.  

మరిన్ని వార్తలు