సంక్రాంతికి సింహపురి ‘కోడ’ల్లుళ్లు  | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి సింహపురి ‘కోడ’ల్లుళ్లు 

Published Tue, Jan 2 2024 6:27 AM

Bet hens from Nellore district to Godavari districts: AP - Sakshi

సాక్షి, భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్‌): సంక్రాంతి కోడి పందేలకు గోదావరి జిల్లాల్లో ఉండే క్రేజే వేరు. పందెం పుంజులకూ డిమాండ్‌ భారీగానే ఉంటుంది. సాధారణంగా సంక్రాంతి పందేల కోసం స్థానికులే పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తుంటారు. కాగా.. కోవిడ్‌ తరువాత సింహపురి (నెల్లూరు) ప్రాంత వ్యాపారులు పందెం పుంజులను గోదావరి జిల్లాలకు తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు.

పండుగ రోజుల్లో పూర్వ గోదావరి జిల్లాల్లోని ప్రధాన బరుల్లో ఒక్కొక్క చోట రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. పండుగ మూడు రోజుల్లో వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు సంఖ్యలో కోడి పుంజులు అవసరమవుతాయి. సంక్రాంతి పందేల కోసం కోడి పుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీటి అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.

ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి మరీ..
కోవిడ్‌ అనంతరం సింహపురి ప్రాంతానికి చెందిన వారు పందెం పుంజుల పెంపంకంపై ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు జిల్లాతోపాటు సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలి­వస్తున్నారు. ఒక్కొక్కరు 20 వరకు పుంజులతో.. నలుగురైదుగురు కలిసి ప్రత్యేక వాహనాల్లో వస్తున్నారు.

విజయవా­డ–కాకినాడ హైవే వెంట తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, పెరవలి, సిద్ధాంతం, గుండుగొలను తదితర ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే రద్దీ రోడ్లలో ఖాళీ ప్రదేశాల వద్ద కోడి పుంజులను ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, సేతువ తదితర జాతులు, వివిధ రంగుల్లో వీరి వద్ద అందుబాటులో ఉంటున్నా­యి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి ఒక్కో పుంజు రూ.3 వేల నుంచి రూ.10 వేల ధర పలుకుతున్నాయి. 

రోజుకో చోట విక్రయం
స్థానికంగా పందేల కోసం సిద్ధం చేసే పుంజుల ధర అధికంగా ఉంటోంది. వాటికి అందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి తెచ్చే పుంజులు ఇక్కడి పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా మంచి సైజు, రంగుల్లో ఉంటున్నాయి. ఇక్కడ పెంచే పుంజులతో పోలిస్తే నెల్లూరు ప్రాంత పుంజుల ధర తక్కువగా ఉండటంతో పందేల రాయుళ్లు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

పుంజుల్ని అమ్ముతున్న చోటే డింకీ పందాలు కట్టి బాగున్న పుంజులను ఎంపిక చేసుకుని తీసుకుంటున్నారు. పందెంలో అదృష్టం కలిసొస్తే తమకు పెద్ద పండుగేనంటున్నారు. తెచ్చిన పుంజులు మూడు నాలుగు రోజుల్లో అమ్ముడవుతున్నాయని.. ఒక్కోరోజు ఒక్కోచోట అమ్మకాలు చేస్తుంటామని నెల్లూరుకు చెందిన కోళ్ల పెంపకందారుడు వెంకటరమణ తెలిపాడు. నాలుగేళ్లుగా ఏటా వస్తున్నా­మని, అమ్మకాలు బాగానే ఉంటున్నాయని వివరించాడు. 

హోటళ్లు.. లాడ్జిలకు డిమాండ్‌
కోళ్ల కుంభమేళాగా పిలిచే సంక్రాంతి పందేలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని హోటళ్లు, లాడ్జిలకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్‌ నెల నుంచి హోటల్స్, లాడ్జి రూమ్‌ల ముందస్తు బుకింగ్‌ ముమ్మరంగా సాగుతోంది. బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, ఏపీలోని విశాఖ, విజయవాడతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్దఎత్తున పందేలరాయుళ్లు, పందేలను వీక్షించేందుకు వివిధ వర్గాల ప్రజలు ఇక్కడకు తరలి వస్తుంటారు.

దీంతో అతిథుల కోసం ఈ ప్రాంతాల వారు జిల్లాలోని హోటల్స్‌లో బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దృష్ట్యా సాధారణ లాడ్జిలతోపాటు పేరొందిన హోటల్స్‌లో రూమ్‌లను జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్స్‌గా బుక్‌ చేస్తున్నారు. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం పట్టణాలతో పాటు ఆచంట, పెనుగొండ, అత్తిలి తదితర ప్రాంతాల్లోని హోటల్స్, లాడ్జిలలో ఇప్పటికే 70 శాతం రూమ్‌లు బుక్‌ అయ్యాయి. మరో వారం రోజులు గడిస్తే రూమ్‌లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. 

రూమ్‌ రూ.5 వేల నుంచి రూ.10 వేలు
సంక్రాంతికి అడ్వాన్స్‌గా బుక్‌ చేసే హోటల్స్‌ రూమ్‌ల ధరలు ఆయా హోటల్స్‌ బట్టి 24 గంటలకు రూ.5 వేల నుంచి  డిమాండ్‌ బట్టి రూ.10 వేల వరకు ఉంటోంది. ధర ఎక్కువైనా రూమ్‌ కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తుగానే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం బుక్‌ చేసుకుంటున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు దిగే డీలక్స్, సూట్‌ రూమ్‌లకు సైతం డిమాండ్‌ భారీగా పెరిగింది. పండుగ నాలుగు రోజుల ప్యాకేజీ రూపంలో అయితే రూమ్‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటోంది. 24 గంటలకు అయితే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement