Sakshi News home page

దేశంలో టాప్‌–10లో ఏపీ డిస్కంలు

Published Fri, Feb 2 2024 5:22 AM

Better power supply in AP than the national average - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తున్నాయి. తాజాగా రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) ప్రకటించిన టాప్‌ 62 డిస్కంల జాబితాలో ఏపీ డిస్కంలు జాతీయ స్థాయిలో టాప్‌ 10లో నిలిచి ‘ఏ’ గ్రేడ్‌ సాధించాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, కె.సంతోషరావులు తెలిపారు.

ఈ మేరకు గురువారం వారు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్టు రోజువారీ విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి కోతల్లేకుండా అందిస్తూ ఏపీ రికార్డులు సృష్టిస్తోంది. దేశ సగటు విద్యుత్‌ సరఫరాను మించి రాష్ట్రంలో విద్యుత్‌ను అందిస్తోంది.

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన వినియోగదారుల సేవా రేటింగ్‌ 2022–23 నివేదిక ప్రకారం.. జాతీయ సగటు విద్యుత్‌ సరఫరా పట్టణ ప్రాంతాల్లో 23.59 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 21.26 గంటలుగా ఉంది. కానీ మన రాష్ట్రంలో పట్టణాల్లో 23.85 గంటలు, గ్రామాల్లో 23.49 గంటల పాటు సరఫరా అందిస్తున్నారు. జాతీయ సగటు అంతరాయ సూచికతో పోల్చితే మన డిస్కంలలో సగానికంటే తక్కువగా ఫీడర్‌ అంతరాయాలు నమోదవుతున్నాయి.

సేవలకు దక్కిన గుర్తింపు 
ఏడాదిలో ఈ జాతీయ సగటు అంతరాయ సూచిక 200.15 కాగా, ఏపీ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ(ఏపీఎస్పీడీసీఎల్‌)లో 42, ఏపీ ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ(ఏపీఈపీడీసీఎల్‌)లో 79.68, ఏపీ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ (ఏపీసీపీడీసీఎల్‌)లో 103.86 చొప్పున పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఫీడర్‌కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (డీటీ) వైఫల్యం రేటు 2.01 శాతం మాత్రమే ఉంది. దీని జాతీయ సగటు 5.81 శాతం కంటే ఎక్కువగా ఉంది.

అంతే కాకుండా 2017–18లో డిస్కంల పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉంటే అవి 2022–23లో 5.31 శాతానికి తగ్గాయి. కొత్త సర్వీసులకు వంద శాతం మీటరింగ్‌ పూర్తి చేయడంతో పాటు రిపేర్‌ వచ్చిన వాటి స్థానంలో త్వరితగతిన కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మాన్యువల్‌ జోక్యం లేకుండా ఇన్‌ఫ్రారెడ్‌(ఐఆర్‌) పోర్ట్‌ ద్వారా విద్యుత్‌ బిల్లులు రీడింగ్‌ తీస్తున్నారు. అలాగే వినియోగదారుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లకు బిల్లింగ్‌ హెచ్చరికలు పంపిస్తూ ఆలస్య చెల్లింపుల జరిమానాలు పడకుండా వారిని అప్రమత్తం చేయడం వంటి చర్యలను కేంద్రం తన అధ్యయనంలో పరిగణనలోకి తీసుకుంది.

ఆపరేషన్, విశ్వసనీయత, రెవెన్యూ కనెక్షన్లలో చేసిన కృషి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి తీసుకున్న చర్యలు, మీటరింగ్, బిల్లింగ్, తప్పులను సరిదిద్దడం, ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఈ క్రమంలో సాధించిన విజయాల ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఏపీ డిస్కంలకు టాప్‌ టెన్‌లో స్థానం కల్పించింది.

Advertisement
Advertisement