లైసెన్స్‌ లేకపోయినా.. నో ఫైన్‌ !

9 Nov, 2022 09:11 IST|Sakshi

సాక్షి, భీమవరం: మన రోడ్లపై నిత్యం అనేకమంది ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో జరిమానాలు కట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేకుండా బైక్‌లు నడపడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఈ సమస్యకు భీమవరం పోలీసులు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఎస్పీ యు.రవిప్రకాష్‌ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఎవరైనా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా పట్టుబడితే వారికి ఫైన్‌ కాకుండా రూ. 410లు కట్టించుకుని వెంటనే ఎల్‌ఎల్‌ఆర్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.  

భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా అమలుచేసేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారిని తనిఖీ చేస్తే ప్రతి 10 మందిలో 8 మందికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండడం లేదని పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోతే రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. దీంతో ఎప్పీ రవిప్రకాష్‌ వినూత్నంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. పోలీసు సిబ్బంది తనిఖీలు చేసే సమయంలో లైసెన్స్‌లేని వారు అక్కడికక్కడే ఎల్‌ఎల్‌ఆర్‌ పొందేలా రూపకల్పన చేశారు. లైసెన్స్‌ లేనివారు లేని వారు కేవలం రూ. 410తో ఎల్‌ఎల్‌ఆర్‌ పొందే అవకాశం ఉండడంతో పాటు వెంటనే శాశ్వత లైసెన్స్‌ తీసుకునేలా వారికి అవగాహన కలి్పస్తున్నట్లు రవిప్రకాష్‌ చెప్పారు. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి లైసెన్స్‌లు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 7 వేల మందికి తాత్కాలిక  లైసెన్స్‌లు జారీ చేసినట్లు చెప్పారు. 

హెల్మెట్‌ తప్పనిసరి 
వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని నివారించేలా చర్యలు చేపట్టారు. హెల్మెట్‌ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వాహనాదారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. దీనిలో భాగంగా తనిఖీలు చేసే ప్రాంతాల్లో హెల్మెట్ల అమ్మకాలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. నాణ్యమైన హెల్మెట్లు విక్రయించేలా చేయడం వల్ల జరిమానా కట్టే కంటే హెల్మెట్‌ కొనుగోలు చేయడం, ధరించడం మేలనే భావన వాహనదారుల్లో కలిగేలా చైతన్యం కలిగించడానికి ప్రణాళిక రూపొందించారు. 

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు 
భీమవరం జిల్లాకేంద్రంగా అవతరించిన తరువాత ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు రూపొందించవచ్చనే అంశంపై పట్టణంలోని శ్రీవిష్ణు ఇంజనీరింగ్, ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్, డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లోని సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులతో ప్రత్యేక సర్వే చేపట్టాం.సమస్య పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక.. జిల్లాలో ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లు ఉన్న తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆకివీడు పట్టణాల్లో కూడా ఇదే తరహా సర్వే చేయించి ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి మార్గాన్ని అన్వేíÙస్తాం. 
– రవిప్రకాష్ ఎస్పీ, భీమవరం జిల్లా  

మరిన్ని వార్తలు