మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

1 Aug, 2020 15:52 IST|Sakshi

కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూత

సీఎం జగన్‌ సంతాపం

సాక్షి, అమరావతి : బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) మృతిచెందారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేసి.. చివరి వరకూ అదే పార్టీలో కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అత్యంత బాధాకరం :  డిప్యూటీ సీఎం ఆళ్ల నాని 
పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రా o తి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడును ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. ‘సౌమ్యుడు.. మంచివారు. సుమారుగా మూడున్నర దశబ్దాల పాటు ప్రజా జీవితంలో నిబద్దత.. నిజాయితీగా అంకిత భావంతో పని చేసిన నాయకుడు. పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రములోనే మంచి గుర్తింపు కలిగిన నాయకుడు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని సమయంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంలో పెద్దలతో ఉన్న పరిచయంతో తాడేపల్లి గూడెంలో నిట్ విద్యా సంస్థ నెలకొల్పడం లో పైడికొండల కీలక పాత్ర పోషించారు. సేవా భావం...ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించే వ్యక్తి మాణిక్యాలరావు మృతి తీరని లోటు’ అని విచారం వ్యక్తం చేశారు.

మాణిక్యాలరావు మృతి బాధాకరం: సోము వీర్రాజు
1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేశారు.  జిల్లాస్థాయి నాయకుడి నుంచి  మంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా మాణిక్యాలరావు ఎదిగారు. నేటి రాజకీయాల్లో విలువలతో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పని చేసిన వారి పదవులు వస్తాయని  చెప్పేందుకు మాణిక్యాలరావు ఉదాహరణ. దేవదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అనేక ఆలయాలు అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు బీజేపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.

ఆకస్మిక మరణం పట్ల సంతాపం : ఎంపీ జీవీఎల్
బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర మంత్రి, స్నేహ శీలి, ఆప్త మిత్రులు మాణిక్యలరావు చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. ఇది మా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు అత్యంత బాధాకర పరిణామం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాను. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన మరణం బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటుగా చిరకాలం మిగిలి పోతుంది.

ఆయన మరణం పట్ట చింతిస్తున్నా.. విష్ణువర్ధన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాల రావుగారు మరణం రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి తీర్చలేనిది. 20 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పనిచేసిన సమయంలో వారికి పార్టీ పట్ల నిబద్ధత క్రమశిక్షణ అంకిత భావాన్ని నేను మర్చిపోలేను. వారు నేడు మామధ్య లేరనే విషయాన్ని సగటు కార్యకర్తగా జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. సందర్భంగా వారి మరణానికి చింతిస్తూ నివాళులర్పిస్తున్నాను.

మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మాణిక్యాలరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు.

తెలుగు ప్రజలకు తీరని లోటు : కృష్ణం రాజు 
మాజీ మంత్రి మాణిక్యాలరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదలయి అంచలంచలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు మాణిక్యాలరావు. భారతీయ జనతా పార్టీకి ఆయన చేసిన సేవను మరువలేము. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా