మంగళూరు తీరంలో.. అరుదైన తిమింగలం!

26 Sep, 2023 03:20 IST|Sakshi

గోవా తీరంలో బ్లెయిన్‌విల్లి తిమింగలాలు..

ఏడాదిలో 10,483 డాల్ఫిన్లు, 4 జాతుల తిమింగలాల జాడ!

మత్స్య సంపదపై మొదలైన ఫిషరీ సర్వే ఆఫ్‌ ఇండియా గణన!

మీడియాతో ఎఫ్‌ఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ జయభాస్కరన్‌

తొలిసారిగా భారత సముద్ర జలాల్లో ఒమూరా వేల్‌ ఉనికి గుర్తింపు!

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒమూరా వేల్‌ (తిమింగలం) ఉనికిని కర్ణాటకలోని మంగళూరు తీరంలో గుర్తించామని ఫిషరీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.జయభాస్కరన్‌ వెల్లడించారు. తాము చేపట్టిన సర్వేలో భాగంగా మంగళూరు తీరంలో వీటి సంతతిని ఇటీవల కనుగొన్నామన్నారు. ఒమూరా జాతి తిమింగలానికి దంతాలు ఉండవన్నారు. భారత సముద్ర జలాల్లో వీటి లభ్యత ఇదే తొలిసారని చెప్పారు.

సోమవారం ఆయన విశాఖలోని ఎఫ్‌ఎస్‌ఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మరో అరుదైన బ్లెయిన్‌విల్లి (మిసోప్లొడాన్‌ డెన్సిరో్రస్టిస్‌) జాతికి చెందిన తిమింగలాల జాడ కూడా పశి్చమ తీరంలోని గోవా ప్రాంతంలో లభ్యమైందని తెలిపారు. అయితే ఒమూరా జాతికి భిన్నంగా ఈ తిమింగలాలు పొడవైన దంతాలను కలిగి ఉంటాయన్నారు. దేశంలో 2.02 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల పరిధిలో సముద్ర క్షీరదాలపై ఎఫ్‌ఎస్‌ఐ సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. ఏడాది కాలంలో తూర్పు, పశ్చిమ తీరాల్లో 10,483 డాల్ఫిన్లు 18 రకాలు, నాలుగు జాతులకు చెందిన 27 తిమింగలాల జాడ కనుగొన్నామని చెప్పారు.


జయ భాస్కరన్‌

విశాఖ ప్రాంతంలోనూ వివిధ రకాల డాల్ఫిన్లు.. 
విశాఖ పరిసరాల్లోని సముద్ర జలాల్లోనూ వివిధ రకాల డాలి్ఫన్లు సంచరిస్తున్నాయని జయభాస్కరన్‌ చెప్పారు. ప్రతి ఐదేళ్లకోసారి మత్స్య సంపద గణన చేపడతామని, ప్రస్తుతం ఈ గణన కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం మత్స్య షికారి, మత్స్య దర్శిని వెస్సల్స్‌తో ఎఫ్‌ఎస్‌ఐ సర్వే చేస్తోందన్నారు. ఈ వెసల్స్‌ పాతవి కావడంతో కొత్త వెసల్స్‌ మంజూరు చేయాలని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలాను కోరామని, ఇందుకు ఆయన సమ్మతించారని డీజీ వివరించారు.

విశాఖ ఎఫ్‌ఎస్‌ఐలో ఆధునికీకరించిన మెరైన్‌ మ్యూజి­యంలో రసాయనాల్లో భద్రపరచిన అరుదైన చేప జాతులను ప్రదర్శనకు ఉంచామని, ఇందులో విద్యార్థులు, పరిశోధకులతో పాటు ప్రజలను ఉచితంగా అనుమతిస్తామన్నారు. ఈ మ్యూజియంలో అత్యంత అరుదైన సముద్రపు ఆవు (సీ కౌ)ను ప్రదర్శనకు ఉంచామని తెలిపారు. ఆయన వెంట విశాఖ ఎఫ్‌ఎస్‌ఐ మెకానికల్‌ మెరైన్‌ ఇంజినీర్‌ భామిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు