మాజీ ఎమ్మెల్యే మనవళ్లను మింగిన కరోనా | Sakshi
Sakshi News home page

అన్నదమ్ములను మింగిన కరోనా

Published Wed, Aug 12 2020 11:32 AM

Brothers Decesed With Coronavirus in Guntur - Sakshi

దాచేపల్లి : కరోనా మహమ్మారి అన్నదమ్ములను మింగేసింది. 20 రోజుల వ్యవధిలో కరోనాతో ఇద్దరూ మృత్యువాత పడిన విషాద ఘటన దాచేపల్లి మండలం ముత్యాలంపాడులో చోటుచేసుకుంది. గురజాల మాజీ ఎమ్మెల్యే  కొత్త వెంకటేశ్వర్లు మనువళ్లు కొత్త నరేష్‌ (35), కొత్త రామకృష్ణ (32) కరోనాకు బలయ్యారు. కొత్త వెంకటేశ్వర్లు కుమారుడు కోటేశ్వరరావు, రత్నకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు నరేష్‌ పిడుగురాళ్లలో వ్యాపారం చేస్తుండగా చిన్న కుమారుడు రామకృష్ణ వైఎస్సార్‌ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.

గత నెలలో నరేష్‌ అనారోగ్యానికి గురికావటంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌ తేలింది. కరోనాతో బాధపడుతున్న నరేష్‌ వద్ద సేవలు చేసేందుకు తమ్ముడు రామకృష్ణ ఉన్నాడు. ఈ క్రమంలో కరోనాతో వైద్యం పొందుతున్న నరేష్‌ గత నెల 21వ తేదీన మృతి చెందాడు. నరేష్‌ మృతి చెందిన తరువాత రామకృష్ణ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ రామకృష్ణ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నదమ్ముల మృతితో ముత్యాలంపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. రామకృష్ణ మృతి పట్ల గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీలో క్రీయశీలకంగా పనిచేసిన రామకృష్ణ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.   

Advertisement
Advertisement