ప్రభుత్వంపై ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటున్నా | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటున్నా

Published Thu, Aug 6 2020 3:52 AM

BS Bhanumathi withdraw All allegations against AP Govt - Sakshi

సాక్షి, అమరావతి: హైకోర్టు ఇచ్చిన వ్యతిరేక తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా ఆమోదించలేకపోతోందంటూ తాను కౌంటర్‌లో పేర్కొన్న విషయాలను ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) బీఎస్‌ భానుమతి బుధవారం హైకోర్టుకు నివేదించారు. విశ్రాంత న్యాయమూర్తి, ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వంగా ఈశ్వరయ్య గురించి పొందుపరిచిన విషయాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్‌కు సంబంధించి తాను దాఖలు చేసిన కౌంటర్‌లోని 13వ పేరా మొత్తాన్ని వెనక్కి తీసుకుంటానని తెలిపారు. అలా అయితే దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  

► కోవిడ్‌ వ్యాప్తి నిరోధానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల అమలులో హైకోర్టు విఫలమైందని, అందువల్ల కోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించేలా ఆదేశించాలంటూ బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యుడు జె.లక్ష్మీనరసయ్య ఇటీవల పిల్‌ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బీఎస్‌ భానుమతి ప్రాథమిక కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలా?వద్దా? అన్న అంశంపై నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది. దీనిపై బుధవారం ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధం కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ స్పందిస్తూ రిజిస్ట్రార్‌ జనరల్‌ కౌంటర్‌లో పేర్కొన్న అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  
► హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓ న్యాయమూర్తి పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన తరువాత ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ కౌంటర్‌లో పేర్కొన్నారని, ఇది ఏమాత్రం సబబు కాదని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.  
► న్యాయస్థానాన్ని ఉద్దేశించి స్పీకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని రిజిస్ట్రార్‌ జనరల్‌ కౌంటర్‌లో పేర్కొన్నారు. మాకు తెలిసినంత వరకు స్పీకర్‌పై ఎలాంటి ప్రొసీడింగ్స్‌ పెండింగ్‌లో లేవు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి ఇలాంటి కౌంటర్‌ను ఎవరూ ఆశించరని ఏజీ పేర్కొన్నారు. 
► ఈ సమయంలో హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ స్పందిస్తూ తమ కౌంటర్‌లోని 13వ పేరా మొత్తాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు నివేదించారు.  

Advertisement
Advertisement