Sakshi News home page

రఘురామ కేసులో స్టే ఎత్తేయండి

Published Tue, Apr 16 2024 4:55 AM

CBI request to Supreme Court On Raghu Rama Krishna Raju Case - Sakshi

సుప్రీంకోర్టుకు సీబీఐ అభ్యర్థన

విచారణ వాయిదా వేసిన ధర్మాసనం

2 వారాల తర్వాత విచారణ చేపడతామని స్పష్టీకరణ 

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఇండ్‌–భారత్‌ పవర్‌ (మద్రాస్‌) లిమిటెడ్‌ బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై దర్యాప్తు కొనసాగించడానికి వీలుగా స్టే ఎత్తేయాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సర్క్యు­లర్‌ను సవాల్‌ చేస్తూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూ­ర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహ­తాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. ఆర్‌బీఐ సర్క్యులర్‌కు సంబంధించి క్రిమినల్‌ చర్యల్లో ఎఫ్‌ఐఆర్‌ కొనసాగుతోందన్నారు. దీనికి సంబంధించి తీర్పు ఉందని తెలి­పారు. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసా­గకుండా సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశా­రు. దర్యాప్తు కొనసాగించడానికి వీలుగా స్టే ఎత్తేయాలని అభ్యర్థించారు. రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీనియర్‌ న్యాయ­వాది అందుబాటులో లేని కారణంగా కేసు­ను కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు.

ఇరు­పక్షాల వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని కేసును వాయిదా వేసింది. రూ.వందల కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఇండ్‌–భారత్‌ పవర్‌ (మద్రాస్‌) లిమిటెడ్, రఘు­రామకృష్ణరాజు మరో 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏర్పాటు చేస్తా­మన్న కంపెనీని నెలకొల్పకుండా.. ఇతర బ్యాంకుల్లో ఆ సొమ్ములు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసి వాటిపై మళ్లీ రుణం తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. 

రంగంలోకి దిగిన ఈడీ
మరోవైపు ఇండ్‌ – భారత్‌ సన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్‌ఫోర్స్‌­మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. తన సంస్థ కోసమని రఘురామ 2011లో మారి­షస్‌కు చెందిన స్ట్రాటజిక్‌ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్‌ – భారత్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఉత్కళ్‌)కు తరలించేశారు.

ఈ వ్యవహా­రం మొత్తం ఫారెన్‌ ఎక్సే్ఛంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా) దృష్టిలో పడింది. దీంతో విషయాన్ని లోతుగా పరిశీలించిన ఫెమా అధికారులు మారిషస్‌ కంపెనీ నుంచి రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీ ఇండ్‌ –భారత్‌ సన్‌ ఎనర్జీకి రూ.202 కోట్లు అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్‌ –భారత్‌ ఎనర్జీ లిమి­టెడ్‌కు ఈ మొత్తం బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. రఘురామ­రాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రూ.40 కోట్లు జరిమానా కూడా విధించింది.

ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన బ్యాంకులు
తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం దివాలా ప్రక్రియకు అనుమతి కోరు­తూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌­టీ)ని ఆశ్రయించింది. ఇండ్‌–భారత్‌ థర్మల్‌ రూ.1,383 కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదని బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదు చేసింది. రఘురామ కంపెనీ తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం రూ.872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాలా తీసినట్లుగా భావిస్తూ దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కోరింది. దీంతో బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్‌సీఎల్‌టీ దివాలా ప్రక్రియకు అనుమతించింది. 

బ్యాంకులను నిండా ముంచిన రఘురామకృష్ణరాజు
బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని వాటిని నిండా ముంచిన రఘురామ­కృష్ణరాజుపై దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. గతంలో సీబీఐ దర్యాప్తును ఆపాలంటూ ఆయన తెచ్చుకున్న స్టేను ఎత్తివేయా­ల­ంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరోసారి రఘురామ మోసాలు చర్చనీయాంశంగా మారాయి. ఇండ్‌– భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ పేరుతో ఆయన వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలను తీసు­కున్నారు.

ఈ మొత్తాలను కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకులను నిండా ముంచారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్‌–భారత్‌ థర్మల్‌ పవర్‌ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ ఆ బ్యాంకు సీబీఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూ­రితంగా అమ్మేసుకోవడం, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

2020 అక్టోబర్‌లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించాయి. వీటిలో పలు ఫైళ్లు, హార్డ్‌ డిస్కులను స్వాధీనం చేసుకున్నాయి ఈ సందర్భంగా సంస్థకు చైర్మన్‌గా ఉన్న రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.  

Advertisement
Advertisement